అన్ని బ్యాంకు శాఖల్లో మార్పిడికి అనుమతి
ఒక్కరు ఒకే విడత రూ.20వేల వరకే మార్చుకోగలరు
రూ.2,000 నోటు మార్పిడికి బ్యాంకులు తగిన విధంగా సన్నద్ధమయ్యాయి. పౌరులు ఎవరైనా సరే ఏ బ్యాంకు శాఖకు వెళ్లి అయినా ఒక విడత పది రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు. అంటే రూ.20వేల విలువైన నోట్లను ఇతర డీనామినేషన్ నోట్లలోకి మార్చుకోవచ్చు. తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకే వెళ్లాల్సిన అవసరం లేదు. సమీపంలోని ఏ బ్యాంకు శాఖలో అయినా ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. కనుక ఈ రోజే వెళ్లాలనేమీ లేదు.బ్యాంకు శాఖకు వెళ్లి రూ.2,000 నోట్లను మార్చుకునే వారు ఎలాంటి గుర్తింపు పత్రాలు కానీ లేదంటే దరఖాస్తు ఫారమ్ కానీ పూర్తి చేయక్కర్లేదు. ఈ మేరకు బ్యాంకులు స్పష్టతనిచ్చాయి. ఒక వ్యక్తి ఒక బ్యాంకు శాఖలో ఒక విడత రూ.20వేల విలువ మేరకే మార్చుకోగలరు. ఒక రోజు రూ.20వేల కంటే ఎక్కువ విలువైన నోట్లను మార్చుకోవాలని అనుకునే వారు ఒక్కో బ్యాంకు శాఖలో రూ.20వేల చొప్పున మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీల్లేదని ఆర్ బీఐ లేదా బ్యాంకులు స్పష్టం చేయలేదు.ఇక పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లను కలిగిన వారు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఖాతాలో డిపాజిట్ చేసుకునే వారి విషయంలో ఒక రోజులో రూ.20వేల పరిమితి లేదు. ఎన్ని కోట్ల విలువ చేసే నోట్లను అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్ బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి కూడా నోట్లను మార్చుకోవచ్చు. కొన్ని బ్యాంకులు కరస్పాండెంట్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నాయి. బ్యాంకు కరస్పాండెంట్ వద్ద అయితే ఒక రోజులో రెండు నోట్లను మార్చుకోవచ్చు. ఎవరైనా నోట్లను తీసుకునేందుకు తిరస్కరిస్తే ఆర్ బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.