Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఆప్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనలేరు : కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో బీజేపీ`ఆప్‌ మధ్య రాజకీయ విబేధాలు ముదిరిన వేళ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ సొంత ప్రభుత్వం పైనే విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత సీఎం ప్రసంగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, సభలో బీజేపీ సభ్యులు నినాదాలు చేయగా.. వారికి వ్యతిరేకంగా ఆప్‌ సభ్యులు సైతం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండిరచారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుందని, ప్రజలు ఇళ్లలో భోజనం చేయడం కష్టంగా మారిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పన్ను విధించిందని, ఇంత పన్ను ఎప్పుడూ లేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలు, పెరుగు, తృణధాన్యాలు, పప్పులు, బియ్యం, పంచదారపై ఎప్పుడూ పన్ను విధించలేదని, బ్రిటిషర్లు సైతం పన్ను విధించలేదంటూ మండిపడ్డారు.
ఆపరేషన్‌ కమల్‌ విఫలమైందని చెప్పేందుకే..
ఆప్‌ ఎమ్మెల్యేలు నిజాయితీపరులని, అందుకే ఒక్క ఎమ్మెల్యే సైతం అమ్ముడుపోలేదని, దిల్లీలో బీజేపీ ఆపరేషన్‌ కమలం విఫలమైందని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకే.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదన్నారు. అందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు. వారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారని, జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించే పనిలో కేంద్రం నిమగ్నమైందని ఆరోపించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచి డబ్బు సమకూరుస్తోందంటూ ఆరోపించారు. పెట్టుబడిదారులకు రూ.10వేలకోట్లు రుణమాఫీ చేశామని కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో అంగీకరించిందని కేజ్రీవాల్‌ అన్నారు. అప్పులతో రైతులు సతమతమవుతుంటే.. వారి రుణా మాత్రం మాఫీ కావడం లేదని, భూమిని అటాచ్‌ చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల రుణాలు సైతం మాఫీకాక.. అప్పులు తీర్చేందుకు వారి తల్లిదండ్రులు వ్యవసాయ భూములను తాకట్టు పెడుతున్నారన్నారన్నారు. ఇదిలా ఉండగా.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌పై ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ పలు ఆరోపణలు గుప్పించారు. ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఎల్‌జీ రూ.1400కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పాఠక్‌ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సభలో పాఠక్‌ చేసిన ప్రకటనకు ఆప్‌ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img