Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పంజాబ్‌ సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ

సీఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక
నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
సమాలోచనల అనంతరం కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం

చండీగఢ్‌ : పంజాబ్‌ కొత్త సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆదివారం చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించిన అధిష్ఠానం.. రాజకీయ లబ్ధి దృష్ట్యా నూతన సీఎంను ఎన్నుకున్నది. దళిత`సిక్కును సీఎంగా లేదా డిప్యూటీ సీఎంగా ఎంపిక చేస్తారన్న ఊహాగానాల మేరకే పంజాబ్‌ శాసనసభపక్ష నేత (సీఎల్పీ)గా చన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. పంజాబ్‌ సీఎల్పీ నేతగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ ట్వీట్‌ చేశారు. దళిత సిక్కు అయిన చన్నీ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అమరేందర్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఈయన ఒకరు. కాగా, కొత్త ముఖ్యమంత్రి సఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా

పేరును ప్రకటిస్తారనే సమయానికి చన్నీ ఎన్నిక ఆశ్చర్యపర్చింది. రంధావా నియామకంపై పార్టీ ఎమ్మెల్యేలలో కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అంతర్గతంగా సంపూర్ణ మద్దతు లభించిన వ్యక్తికే సీఎం గద్దెపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించిందని తెలిపారు. చన్నీ ఎన్నికపై రంధావా స్పందించారు. చన్నీ తనకు సోదరుడని, ఆయన సీఎల్పీ నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు రంధావా కృతజ్ఞతలను తెలిపారు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు, అమరేందర్‌ సింగ్‌కు మధ్య నెలల తరబడి కొనసాగిన విభేదాల నేపథ్య పరిణామాలకు తాజా ప్రకటనతో తెరపడినట్లు అయింది. చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ (48) చంకౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన దళితుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పంజాబ్‌ సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. అమరేందర్‌ సింగ్‌ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంతకుముందు, సీఎల్పీ నేతగా రంధావాను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనే నూతన ముఖ్యమంత్రి అని అంతా భావించారు. కాంగ్రెస్‌కు విధేయుడు అయిన రంధావా పేరును కొత్త సీఎంగా పార్టీలో చాలా మంది ప్రతిపాదించారు. అయితే చివరి నిమిషంలో చన్నీ పేరు తెరపైకి వచ్చింది. పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, మాజీ చీఫ్‌ సునీల్‌ రaాఖడ్‌, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌, ప్రతాప్‌ సింగ్‌ భజ్వా, రణ్వీత్‌ బిట్టు కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. సీనియర్‌ నేత అంబికా సోనీ పేరు కూడా తెరపైకి రాగా తాను సీఎం రేసులో లేనని ఆమె ప్రకటించారు. అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపిన తర్వాతే రంధావా పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకులు రాహుల్‌ గాంధీతో మాట్లాడినట్టు తెలిసింది. సిక్కు నేతే ముఖ్యమంత్రి కావాలన్న దృష్ట్యా కేబినెట్‌ మంత్రిగా ఉన్న సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా వైపే అధిష్ఠానం మొగ్గు చూపిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పదవుల ఆశలేదు.. : రంధావా
తనకు పదవుల వ్యామోహం లేదని అంతకుముందు విలేకరులతో మాట్లాడిన రంధావా తెలిపారు. సీఎం రేసులో ఉన్నారుగా అని విలేకరులు ప్రశ్నించగా తానుగానీ తన కుటుంబంగానీ ఎన్నడూ పదవుల కోసం ఆశపడలేదని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నామా అని ఓ విలేకరి అంటే మీరు మాట్లాడుతున్నది కాంగ్రెస్‌ కార్యకర్తతో అని ఆయన చమత్కరించారు. పార్టీ, రాష్ట్ర ప్రజలు వెంట ఉన్నంత వరకే ఏదేని ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగగలరని అమరేందర్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎల్పీ నేతను ఎప్పటిలోగా ప్రకటిస్తారన్న ప్రశ్నకు ఓ గ్రామానికి సర్పంచ్‌ను ఎన్నుకోవాలంటే 20 రోజుల వరకు సమయం పడుతుంది.. అలా అని అంత సమయం తీసుకుంటామని కాదు. త్వరలోనే పేరును ప్రకటిస్తారు అని రంధావా బదులిచ్చారు.పార్టీ తనను అవమానించిందని అమరేందర్‌ అనడంపై రంధావా స్పందించారు. బీజేపీ ఇప్పటివరకు ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చింది. కాంగ్రెస్‌లోనూ ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా తొమ్మిదన్నరేళ్లు కొనసాగిన ఘనత అమరేందర్‌ సింగ్‌ది. ఆయనకు దక్కిన గౌరవం మరే ముఖ్యమంత్రికి దక్కలేదు’ అని రంధావా చెప్పారు. అమరేందర్‌ సింగ్‌తో విభేదాలు ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకు ఎన్నికలు సమీపిస్తున్నందున ఇచ్చిన హామీల అమలు విషయంలో అధిష్ఠానం ఆందోళనకు గురైందని రంధావా తెలిపారు. ఓ సీనియర్‌ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని సిద్ధూపై అమరేందర్‌ విసుర్లనుద్దేశించి అన్నారు. ఏప్రిల్‌ 26 నుంచి అమరేందర్‌ సింగ్‌తో సత్సంబంధాలు లేవని, అయినా ఆయనను ఎప్పుడూ అగౌరవించలేదని, ఆయన తనకు పితృసమానులని రంధావా చెప్పారు. విభేదాలు రానంత వరకు ఆయనతో సన్నిహితంగా ఉండేవాడినన్నారు.
పంజాబ్‌ నేతలతో ఏఐసీసీ పరిశీలకుల మంతనాలు
కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయమై పంజాబ్‌ నేతలతో ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి, పంజాబ్‌ వ్యవహారాల ఇంచార్జి హరీశ్‌ రావత్‌, పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్‌ మాకెన్‌, హరీశ్‌ చౌదరీ స్థానిక హోటల్‌లో కలుసుకొని అందరి అభిప్రాయాలను సేకరించారు.
దిల్లీలోని పార్టీ అధిష్ఠానంతోనూ సంప్రదింపులు జరిపారు. ఒకవేళ హిందువును సీఎల్పీగా ఎంపిక చేస్తేగనుక ఉప ముఖ్యమంత్రులుగా సిక్కు, దళితుడిని నియమించే యోచన చేశారు. సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని అధినేత్రి సోనియాగాంధీకే పార్టీ వర్గాలు వదిలేయడం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img