Friday, September 30, 2022
Friday, September 30, 2022

పంజాబ్‌ సీఎం అమరేందర్‌ రాజీనామా

ఆమోదించిన గవర్నర్‌
కొత్త సీఎం ఎంపిక బాధ్యత సోనియాకు అప్పగించిన సీఎల్పీ
సిద్ధూతో వివాదంతోనే రాజకీయ సంక్షోభం

న్యూదిల్లీ / చండీగఢ్‌ : ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం కోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. పంజాబ్‌ మాత్రమే కాదు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లోనూ ఇదే తరహా పరిస్థితులను కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది. తాజా పరిణామాల దృష్ట్యా పంజాబ్‌ సీఎంగా అమరేందర్‌సింగ్‌ శనివారం రాజీనామా చేశారు. తనను కాదని నవజ్యోత్‌ సిద్ధూకు అధిష్ఠానం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అమానంగా భావించి పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ముదిరి అమరేందర్‌ సింగ్‌ రాజీనామాకు దారితీసింది. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభపక్ష సమావేశం అనంతరం ఆయన తన రాజీనామాను ప్రకటించారు. చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎల్పీ భేటీ జరిగింది. అంతకుముందు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో అమరీందర్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడారు. తనకు జరిగిన అవమానంపై మొరపెట్టుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అమరీందర్‌.. తదుపరి కార్యాచరణను తమ మద్దతుదారులతో చర్చించి నిర్ణయిస్తానని తెలిపారు. ఆపై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అమరీందర్‌ సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామాను ఆయన ఆమోదించారు. అధిష్ఠానానికి తనపై నమ్మకం లేదని, ఎమ్మెల్యేలను పిలవడం ఇది మూడవసారని, ఇంతటి అవమానం సహించలేనని విలేకరులతో అమరేందర్‌ సింగ్‌ అన్నారు. 52 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తొమ్మిదన్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయ సంక్షోభం దృష్ట్యా ముఖ్యమంత్రిగా అమరేందర్‌ సింగ్‌ను తొలగించాలని కోరుతూ సోనియా గాంధీకి పార్టీకి చెందిన 50 మందికిపైగా ఎమ్మెల్యేలు ఇటీవల లేఖ రాశారు. సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని వారు కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నాలుగు నెలలకు ముందు ఈ పరిణామం చోటుచేసుకున్నది. దీంతో పార్టీ సీనియర్లు అజయ్‌ మాకెన్‌, హరీశ్‌ చౌదరీలను కేంద్ర పరిశీలకులుగా అధిష్ఠానం రంగంలోకి దించింది. సీఎల్పీ సమావేశానికి పంజాబ్‌ వ్యవహారాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న కాంగ్రెస్‌కు ఇటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. ప్రసుత పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు అమరేందర్‌కు మధ్య విభేదాలే తాజా పరిణామానికి కారణమన్న వాదన ఉంది. ఎన్నికల నేపథ్యంలో సిద్ధూకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉందని కూడా తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్టీలో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో అమరేందర్‌ విసిగిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో పరిస్థితుల మధ్య సమతుల్యతకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోందని, ఉన్నత పదవిలో హిందువును నియమించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ రaాకర్‌ పేరు తెరపైకి వచ్చింది. రaాకర్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పంజాబ్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాహుల్‌ గాంధీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారంటూ ట్విట్టర్‌ వేదికగా ఆయనపై ప్రశంసలను రaాకర్‌ కురిపించారు. సునీల్‌ రaాకర్‌.. పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా, బియాంత్‌ సింగ్‌ మనుమడు ఎంపీ రవనీత్‌ సింగ్‌ బిట్టూలలో ఒకరిని నూతన ముఖ్యమంత్రిగా నియమిస్తారనే అంచనాలున్నాయి. పంజాబ్‌ పీసీసీ పగ్గాలను సిద్ధూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరేందర్‌ ససేమిరా అనడం విదితమే.
కొత్తఎంపిక బాధ్యత సోనియాదే.. :
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధినేత్రి సోనియాగాంధీకి అప్పగించినట్లు పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శనివారం వెల్లడిరచారు. సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా 78 మంది సీఎల్పీ సమావేశానికి హాజరైనట్లు అజయ్‌ మాకెన్‌ విలేకరులతో తెలిపారు. పంజాబ్‌కు, కాంగ్రెస్‌కు అందించిన అమూల్యమైన సేవలను కొనియాడుతూ.. అమరేందర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మరొక తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. భవిష్యత్‌లోనూ పార్టీకి అమరీందర్‌ మార్గదర్శం ఉంటుందని ఆకాంక్షించారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌’ : ఆప్‌ విమర్శ
పంజాబ్‌ అధికార పక్షంలో ఆధిప్యత పోరును ‘గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌’గా ఆమ్‌ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. పంజాబ్‌లో పరిపాలన పడకేసిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ్‌ చడ్డా వీడియో విడుదల చేశారు. ఆధిపత్య పోరు నేపథ్యంలో పంజాబ్‌ సమస్యలన్నీ మరుగున పడ్డాయని విమర్శించారు. పంజాబ్‌ ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. వ్యక్తిగత లబ్ధి తప్ప పంజాబ్‌ సంక్షేమం వారికి పట్టదని, కాంగ్రెస్‌ మునిగిపోయే టైటానిక్‌ అని ఆ పార్టీకి విజన్‌గానీ నిబద్ధతగానీ లేదని పంజాబీలో చడ్డా దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img