Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పండుగ పూటా పస్తులేనా?

మంత్రులు, ఎమ్మెల్యేలకు ఠంచన్‌గా ఒకటిన జీతాలు
మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇప్పటికీ అందని వేతనాలు

. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌, రంజాన్‌ మాసమైనా కనికరించని ప్రభుత్వం
. సర్కారు తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన కార్మికులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ‘మాది పేదల ప్రభుత్వం…పేదలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆచరణలో అది ఏమాత్రం కనిపించడం లేదు. పేదల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. నెల మొత్తం కాయకష్టం చేస్తూ జీతాల కోసం ఎదురుచూసే కార్మికుల సంక్షేమాన్ని జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. శ్రమకు ముందు, ప్రయోజనాలకు చివర అన్న చందంగా వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రెక్కాడితేగానీ డొక్కాడని మున్సిపల్‌ కార్మికులకు 8వ తేదీ వచ్చినా వేతనాలు ఇవ్వలేదు. ఆనందంగా జరుపుకోవాల్సిన గుడ్‌ ప్రైడే, ఈస్టర్‌ పండుగలకు అర్ధాకలితో పస్తులు గడిపే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ముస్లిం కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్‌ జరుపుకుంటారు. కానీ సకాలంలో వేతనాలందక ఆర్థిక సమస్యలతో వారు మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిరది. మంత్రులు, శాసనసభ్యులు, సలహాదారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఒకటో తారీఖున వేతనాలు చెల్లించి తమను మాత్రం 8వ తేదీ వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శనివారం కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి… పర్మినెంట్‌ చేయకపోగా జీతాలు సైతం సక్రమంగా చెల్లించడం లేదని మండిపడుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం, పండుగ సెలవుల పేరుతో అధికారులు మభ్యపరుస్తున్నారని, మంత్రులు, ప్రజాప్రతినిధులకు లేని ఇబ్బంది, నిరుపేద కార్మికులకు జీతాలు ఇవ్వటానికి ఎందుకు వస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. పేదల ప్రభుత్వంగా అభివర్ణించుకునే ముఖ్యమంత్రి…నిరుపేద మహిళా కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? పండుగ సందర్భంగా కడుపు మాడ్చటం తగునా ? అని కార్మికులు నిలదీస్తున్నారు. ఓవైపు నింగినంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాలతో జీవనమే కష్టంగా మారగా…మరోవైపు జీతాలు సకాలంలో ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు వాపోతున్నారు. ఇంటి పన్నులు, చెత్త పన్నులు సకాలంలో కట్టకపోతే పెనాల్టీలు విధిస్తున్నారు. విద్యుత్‌ బిల్లులు కట్టకపోతే సరఫరా నిలిపివేస్తున్నారు. జీతాలు ఎప్పుడిచ్చినా, పస్తులు గడుపుతున్నా తాము మాత్రం విధులు సక్రమంగా నిర్వహించాలా? ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మార్చి 30వ తేదీ శ్రీరామనవమి, ఈనెల 6వ తేదీ గుడ్‌ ఫ్రైడే, 8వ తేదీ ఈస్టర్‌ పండుగ, ప్రస్తుతం రంజాన్‌ మాసం నడుస్తోంది. ముస్లిం సోదరులంతా ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు. కనీసం ఇటువంటి ప్రత్యేక సందర్భాలలోనైనా కార్మికులను ఇబ్బందిపెట్టకుండా జీతాలు సక్రమంగా చెల్లించాలన్న బాధ్యత అధికార యంత్రాంగానికి లేకపోవడం దారుణమని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు. పండుగ సమయాల్లో పారిశుధ్య, ఇతర సిబ్బందికి సెలవు ఇవ్వటం లేదు. పని భారం విపరీతంగా పెంచారు. కార్మికుల ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్ము పూర్తిగా వారి ఖాతాలలో జమ చేయడం లేదు. పేర్ల నమోదులో తప్పులు చూపి కార్మికులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. పీఎఫ్‌ సొమ్మును దారి మళ్లిస్తున్నారు. ఆరోగ్య బీమా (ఈఎస్‌ఐ) కార్మికుల సొమ్ముతో నడుస్తున్నా, వారికి ఆ ప్రయోజనాలు అందడం లేదు. ఇక వైద్య సౌకర్యం అరకొరగానే ఉంది. మందుల సరఫరా పూర్తిస్థాయిలో లేదు. అనారోగ్యం సందర్భంలో వారికి ఇవ్వవలసిన సెలవుల డబ్బు పూర్తిగా జమ చేయడం లేదు. ఇలా అనేక సమస్యలతో కార్మికులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. సర్కారు తీరు మార్చుకోకుండా, కార్మికుల పట్ల ఇదే రకంగా వివక్షను కొనసాగిస్తే కార్మికాగ్రహం చవిచూడాల్సి వస్తుందని కార్మికసంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరికీ తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img