Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

పదవీ గండం !

ఉండేదెవరు`ఊడేదెవరు
మంత్రివర్గ విస్తరణపై వైసీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ
పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన, కొడాలి స్థానాలు పదిలమని ప్రచారం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డే సంకేతాలివ్వడంతో…ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగేదెవరు? ఉద్వాసనకు గురయ్యేవారెవరు? ఆ స్థానంలో ఎవరెవరికి అవకాశాలు దక్కనున్నాయి? 2024 ఎన్నికలను ఎదుర్కోనున్న కొత్త మంత్రివర్గం ఎలా ఉండబోతోంది?…ఇది రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. వారితోపాటు మిగిలిన పార్టీల్లోనూ ఎక్కడ నలుగురు కలిసినా ఇదే అంశంపై భిన్నకోణాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరి మూడేళ్లు పూర్తికావస్తోంది. ఈనెల 11వ తేదీ రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో…త్వరలో కేబినెట్‌ ప్రక్షాళన చేపట్టబోతున్నట్లు సీఎం జగన్‌ మంత్రులకు సంకేతాలిచ్చారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని మొదట్లోనే చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించాల్సి ఉంటుందని, మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే మీకే మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని జగన్‌ వారికి చెప్పి, మంత్రులను మానసికంగా సిద్ధం చేశారు. కొన్ని సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో కొందరిని కొనసాగించాల్సి రావచ్చునని చెప్పారు. దీంతో మంత్రులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. మొత్తం మంత్రులను మారిస్తే ఏ ఇబ్బందీ లేదు. కానీ కొందరిని మాత్రమే కొనసాగిస్తే…అది ఏ ప్రాతిపదికన జరుగుతుందో అర్థంగాక మంత్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏ సమీకరణల ఆధారంగా కొందరు మంత్రులను కొనసాగిస్తారు. వాటిల్లో తాము ఉంటామా? లేకపోయినా..తమ స్థానంలో జూనియర్లకు మంత్రి పదవులు కేటాయిస్తే పరిస్థితి ఏంటి ? ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి ఇస్తారు? ఇలా రకరకాలుగా మంత్రులు అంతర్మథనం చెందుతున్నారు. శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. పార్టీ శ్రేణుల్లో మంత్రివర్గ విస్తరణపైనే రకరకాల విశ్లేషణలతో సంభాషణలు కొనసాగాయి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని ప్రస్తావించారు. దీనినిబట్టి కొత్త మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయిందని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
మంత్రివర్గ కూర్పు ఒక సవాలే !
జగన్‌మోహన్‌ రెడ్డికి మంత్రివర్గ కూర్పు సవాల్‌గా మారనుంది. గత ప్రభుత్వాల్లోనూ మంత్రివర్గ విస్తరణ చోటుచేసుకున్నప్పటికీ, రెండున్నర సంవత్సరాల తర్వాత మొత్తం మంత్రులను మార్పు చేయడమనేది కొత్త ప్రయోగమే. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసి పాలన కొనసాగించాలన్న కృతనిశ్చయంతో సీఎం ఉన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు అత్యంత వేగంగా సాగుతున్నాయి. కొత్త మంత్రివర్గ విస్తరణ ఈ లోగానే ఏర్పాటవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సహజంగా మంత్రివర్గ విస్తరణకు కుల, మత, ప్రాంతాల ఆధారణంగా సమీకరణలుంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవిని తప్పక కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబినెట్‌లో 25 మంది ఉండగా, 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. మంత్రులకు ప్రాధాన్యం దక్కకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కాబట్టి ప్రతీ జిల్లాకో మంత్రిని తప్పక కేటాయించాల్సిన పరిస్ధితి. ఈ విధంగా చూస్తే కడప జిల్లాకు సైతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నందున మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. ఇక జిల్లాల వారీగా ఇచ్చే మంత్రి పదవులు, ఆయా జిల్లాల్లో మెజార్టీ కులాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. గతంలో మంత్రి పదవి ఇచ్చిన ప్రాంతం కాకుండా మరొక ప్రాంతానికి అవకాశం ఇవ్వాలి. మొత్తంగా జరిగే కూర్పు గత మంత్రివర్గ స్థాయిలో కుల సమీకరణల కనుగుణంగా జరగాలి. అన్నింటికీ మించి శాఖల కేటాయింపులు చేసే శాసనసభ్యులకు ఆయా రంగాలపై కొంత పట్టున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ మంత్రివర్గ కూర్పు కోసం పార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నలుగురికి కొనసాగే అవకాశం ?
కొత్త మంత్రివర్గంలో దాదాపు 20 మందికి పైగా కొత్తవారే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానిలకు మళ్లీ కేబినెట్‌లో అవకాశం ఉంటుందంటున్నారు. వీరిలో కొడాలి నాని మంత్రిగా విఫలమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై విమర్శల దాడికి బాగా ఉపయోగపడ్డారని, భవిష్యత్తులోనూ ఇటువంటి వ్యక్తి అవసరమని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఒకవేళ ఆయన వేషధారణ, వినియోగించే పరుష పదజాలం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తే, ఆ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌కి అవకాశం దక్కవచ్చు. ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుండి స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్‌ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెబుతున్నారు. తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే ధర్మాన ప్రసాదరావుకి స్పీకర్‌ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ముందున్నారు. అయితే ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు అవకాశం ఉండదు. విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి దాడిశెట్టి రాజా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీసీల నుంచి ముమ్మడివరం ఎమ్మెల్యే సతీశ్‌కు ఖాయమని ప్రచారం సాగుతోంది. పశ్చిమగోదావరిలో క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు, కాపువర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్‌ పేర్లు రేసులో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో పేర్ని నాని స్థానంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, బీసీల నుంచి కొలుసు పార్థసారధి, జోగి రమేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ నుంచి మల్లాది విష్ణు, గుంటూరు జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆశిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ను ఓడిరచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. వాస్తవానికి ఆయనకు ఎన్నికల సందర్భంగానే లోకేశ్‌ను ఓడిస్తే మంత్రి పదవి ఖాయమని జగన్‌ హామీ ఇచ్చి ఉన్నారు. మహిళా కోటాలో ఆర్కే రోజా, విడదల రజని, ఉషశ్రీ చరణ్‌, జొన్నలగడ్డ పద్మావతి ఆశలు పెట్టుకున్నారు.
ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటాలో అంబటి రాంబాబు ప్రధాన రేసులో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో గతంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా చేసిన మహీధర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆశిస్తున్నారు. ఎస్సీ కోటాలో కిలివేటి సంజీవయ్య రేసులో ఉన్నారు.
అయితే ఇక్కడ ఇటీవల పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించినందున, ఆ స్థానాన్ని మరలా మేకపాటి కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. కడప నుండి ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img