Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

పదేపదే ఆంధ్రాకు అన్యాయం

బీజేపీ ఏడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం
హామీలు అమలు చేయని మోదీ
ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ
అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి
ప్రజలను చైతన్యపరిచి ఉద్యమానికి సన్నద్ధం
కేంద్ర బడ్జెట్‌పై వామపక్షాల నిరసన సదస్సులో నేతలు

విశాలాంధ్ర`విజయవాడ: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తోంది. మోదీ ఏడున్నరేళ్ల పాలనలో ఆంధ్రాకు తీవ్ర ద్రోహం చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్ష పార్టీలు మోదీకి సాగిలపడటం వల్లే ఈ దుస్థితి వచ్చింది. తాము ఏం చేసినా ప్రశ్నించలేరనే ధైర్యంతోనే ఆంధ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. దిల్లీ తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి పెద్దఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది..’ అని వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వామపక్షాల అధ్వర్యాన శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా గురించి బీజేపీ నాయకులు బరితెగించి ముగిసిన అధ్యాయమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అడిగే రాజకీయ పార్టీల నాయకులను తమ స్వార్థం కోసం మాట్లాడుతున్నారని నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండగా, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు దానిని తొలగించాలని కేంద్ర అధికారులపై ఒత్తిడి తీసుకురావడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఒక్కసారి అయినా మాట్లాడారా.. అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసే విషయంలో మాత్రం శరవేగంగా పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో కనీసం విభజన హామీలు అమలు చేయడం లేదని, బుందేల్‌ఖండ్‌ తరహాలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వాలని కోరితే విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రామాయపట్నం పోర్టు, విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదన్నారు. దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ చట్టానికి నిధుల కోత విధించారని చెప్పారు. కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్‌ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పడం విడ్డూరంగా ఉందని, విజయవాడలో ఫ్లై ఓవర్లు మినహా ఎక్కడా ఒక్క జాతీయ రహదారి నిర్మించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు నిధులు ఇవ్వకుండా రోడ్లకు రూ.3లక్షల కోట్లు ఇస్తామని చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రులకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు చేయకుండా నమ్మక ద్రోహిగా మిగిలిపోయారని చెప్పారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు అయినా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని, విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధానమంత్రి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ రంగంలో గుత్తాధిపత్యం కోసం అంబానీ ప్రయత్నిస్తున్నారని, దానికి అనుగుణంగానే కేంద్ర బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తున్నా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ రెండేళ్లపాటు కోవిడ్‌ సృష్టించిన అల్లకల్లోలం నుంచి గుణపాఠం నేర్చుకుని వైద్య, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉండటం వల్ల తమ రాష్ట్రాల హక్కుల గురించి ప్రశ్నించలేకపోతున్నాయని విమర్శించారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య వైరుధ్యాలు పెంచేలా బడ్జెట్‌ ఉందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయకుండా రాష్ట్ర ప్రజలపై పన్నులు వేయడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం పైసా ఖర్చు చేయకుండా ప్రైవేటు కాంట్రాక్టర్ల ద్వారా రోడ్లు నిర్మిస్తోందని, వారు ప్రజల నుంచి టోల్‌ ఫీజు రూపంలో దండుకుంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తిప్పికొట్టేందుకు వామపక్షాలు, కలిసివచ్చే అన్ని పక్షాలతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి అమరనాథ్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఖాదర్‌బాష, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకుడు మోహన్‌, సీపీఐ ఎంఎల్‌ నాయకుడు జాస్తి కిషోర్‌ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు స్వాగతం పలకగా, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ వందన సమర్పణ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img