Friday, September 22, 2023
Friday, September 22, 2023

పరాకాష్ఠకు కేంద్రం ఆగడాలు

. సుప్రీం తీర్పును కాలరాసేలా ఆర్డినెన్స్‌
. ఆప్‌ సర్కారుకు అండగా ఉంటాం
. కేజ్రీవాల్‌కు కేసీఆర్‌ హామీ

విశాలాంధ్ర-హైదరాబాద్‌: దేశంలో మోదీ ప్రభుత్వం ఆగడాలు, అరాచకాలు మితిమీరి…పరాకాష్ఠకు చేరాయని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ మోదీ సర్కారు రాష్ట్రాలలో బీజేపీ యేతర ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఆర్థిక వ్యవహారాల్లో పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాల దుర్మార్గాలకు మోదీ ప్రభుత్వం ఒడిగడుతోందని, దీనిని దేశమంతా చూస్తున్నదని కేసీఆర్‌ చెప్పారు. దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి అత్యంత ప్రజాదరణ ఉన్నదని, ఓ సామాజిక ఉద్యమం నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ ఆప్‌ అని కొనియాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం మోదీ సర్కారు బేఖాతరు చేస్తున్నదని మండిపడ్డారు. దిల్లీ మేయర్‌ ఎన్నికను సైతం నెలల తరబడి అడ్డుకున్నదని గుర్తుచేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఊపిరాడకుండా దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… సీజేఐతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆప్‌ సర్కారుకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. ప్రజాప్రభుత్వానికే సర్వాధికారులు ఉంటాయని, అధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోనే పనిచేయాలని స్పష్టం చేసిందన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మితిమీరిన అధికారాలేవీ ఉండవని చెప్పిందన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని పనిచేయనీయకపోవడమే అరాచకమని, దానిపై లెఫ్ట్‌నెంట్‌ గవర్నరును కూర్చోబెట్టడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమని కేసీఆర్‌ విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును కాలరాసేలా భయంకర ఆర్డినెన్స్‌ తీసుకురావడం మోదీ దుర్మార్గానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు తీరును చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. ఏ ఎమర్జెన్సీ గురించి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు గొంతుచించుకున్నారో… ఇప్పుడు ఇదే జరుగుతున్నదని చెప్పారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎమర్జెన్సీ వచ్చిందని, ఇప్పుడు కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రం తీర్పు ఇవ్వడంతో మోదీ సర్కారు అలాగే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ప్రధానిని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తామంతా అరవింద్‌ కేజ్రీవాల్‌ తరపున నిలబడతామని, ఆయనకు మద్దతిస్తామని ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభలో తమ గళం వినిపిస్తామని, ఆర్డినెన్స్‌ ఆమోదం పొందకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదరణగల కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం ద్వారా దిల్లీ ప్రజలను కేంద్రం అవమానిస్తున్నదన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ దిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు తమ ప్రభుత్వం, పార్టీకి అండగా ఉంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇది కేవలం దిల్లీ ప్రజలు సమస్య మాత్రమే కాదని, దేశ ప్రజల సమస్యని కేజ్రీవాల్‌ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆరోగ్యం, విద్యశాఖల కార్యదర్శులను, డిప్యూటీలను బదిలీ చేసే అధికారం కూడా తనకు లేకపోవడం విచారకరమన్నారు. ఎనిమిదేళ్లుగా దిల్లీలో ప్రభుత్వ అధికారాలన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడి తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు తమ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయినా ఎనిమిది రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిందని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్త మద్ధతు కోరుతున్నామని, మోదీ నియంతృత్వం కొనసాగుతోందన్నారు. ఫెడరల్‌ వ్యవస్థ పటిష్టత కోసం తాము పోరాడతామని పంజాబ్‌ సీఎం మాన్‌ అన్నారు. మనది విభిన్న భాషలు, సంస్కృతులు గల దేశమని, సీఎం కేసీఆర్‌ చండీగఢ్‌కి వచ్చి అమరులైన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించారని గుర్తుచేశారు. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించానని, పంజాబ్‌లో భూగర్భజలాలు ఎలా పెంచాలనే విషయంలో తమకు ఈ పర్యటన ఉపయోగపడిరదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img