Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

పరిహారం… పరిహాసం

. నష్టపరిహార విలువలో వ్యత్యాసం
. నిర్వాసితుల పేర్లు గల్లంతు
. బెదిరింపులతో సంతకాల సేకరణ
. సీఎం జగన్‌ హామీలు సైతం గాలికి…
. పోలవరం నిర్వాసితుల ఆక్రందనలు

విశాలాంధ్ర`కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదన్న లక్ష్యంతో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోబోతున్న ప్రజలకు తగిన న్యాయం చేస్తామని నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు గుప్పించాయి. కానీ హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. తమకు ఏమాత్రం న్యాయం చేయకుండా సర్వేల పేరుతో పాలకులు కాలయాపన చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని భావించి ప్రజలు సర్వం త్యాగం చేశారు. అయితే, నిర్వాసితుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక తదితర విలీనమండలాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన పూర్తిగా జలసమాధి అవుతున్నాయి.
నిర్వాసితులకు అరకొర పరిహారం
చిన్ననాటి బంధాలు, జ్ఞాపకాలు, నివాసాలు, పొలాలు, చెట్లు చామలు, బంధువులను వదులు కోవడానికి సిద్ధపడిన నిర్వాసితుల త్యాగానికి విలువ కట్టకపోగా గతంలో ప్రకటించిన ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ప్రకటించిన విలువలకు పొంతన లేకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అప్పటి పరిహారం విలువలో సగానికి సగం తగ్గించి అరకొర పరిహారం జాబితా చూపుతున్నారు. కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధమైన నిర్వాసితుల త్యాగానికి విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ పరిహారం అరకొరగా ఉండటం బాధితులను ఆందోళనకు గురి చేస్తోంది. నిర్వాసితుల పేర్లలో చాలా అక్రమాలు జరిగాయి. పాత పేర్ల తొలగింపు…కొత్త పేర్లు చేర్పింపు వంటి విన్యాసాలు జరిగాయి. నిర్వాసితుల నుండి ఏడాదికి మూడు, నాలుగుసార్లు దరఖాస్తులు, పత్రాలు తీసుకుంటూ పాలకులు కాలయాపన చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నష్ట పరిహారం జాబితాలో 100 నుండి 150 మంది నిర్వాసితుల పేర్లు గల్లంతయ్యాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి వారిని అర్హులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. 2017 నుండి ప్రతి గ్రామసభలోనూ, డివిజన్‌ కేంద్రం, జిల్లా కలెక్టర్‌, ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఐటీడీఏ పీఓ, స్థానిక తహసీల్దార్‌ వరకు వందలసార్లు బాధితులు దరఖాస్తులు ఇచ్చినా…వారి పేర్లు జాబితాలో పొందుపరచలేదు. సర్వేల పేరుతో కాలయాపన చేయటం తప్ప ఒక్క నిర్వాసితుడికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు..
పరిహారం విలువలో వ్యత్యాసాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల జాబితాలో చాలా వ్యత్యాసం ఉంది. గతంలో అధికారులు నిర్వాసితుడి ఇంటికి వచ్చి పూర్తిస్థాయిలో సర్వేలు జరిపి ఒక్కొక్క ఇంటికి ఎంత విలువ వచ్చిందీ చెప్పారు. ఇది 8 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారం. అప్పటి విలువకీ…ఇప్పుడు కుక్కునూరు మండలంలో అధికారులు ప్రకటించిన ఇంటి విలువకీ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతంలో ఆర్‌సీసీ డాబాకు రూ.12 లక్షల విలువ కట్టిన అధికారులు ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు చూపిస్తున్నారు. గతంలో రేకులు, ప్రహరీ ఉన్న ఇంటికి రూ.9 లక్షలు విలువ కట్టగా తాజాగా రూ.2.40 లక్షలు మాత్రమే చూపిస్తున్నారు. మొదటి గ్రామసభలో అధికారులు ప్రకటించిన నిర్వాసితుల జాబితాలో ఉన్న పేర్లలో 130 గల్లంతవటం ఆందోళనకు గురిచేస్తోంది. 8 ఏళ్లలో వందలసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామసభలను నిర్వాసితులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పునరావాస కాలనీలకు వెళ్లేది లేదని భీష్మంచుకు కూర్చున్నారు.
మరోవైపు, కుక్కునూరు మండలంలో గ్రామసభలు నిర్వహించి నిర్వాసితుల నుంచి అధికారులు సంతకాలు సేకరిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఎంత నష్టపరిహారం ఇస్తారో కూడా చెప్పడం లేదు. బాధితులు అడిగితే తమకు తెలియదంటూ సమాధానం చెబుతున్నారు. కేవలం మొక్కుబడిగానే గ్రామసభలు నిర్వహిస్తున్నారు. సంతకాలు పెట్టకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందని అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు సంతకాలు చేయాల్సి వస్తోంది. 8 ఏళ్లలో 50కి పైగా గ్రామసభలు నిర్వహించారు. అయినా ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్లుగా నిర్వాసితులు తిరగని ప్రభుత్వ కార్యాలయం లేదు. 100సార్లకు పైగా కార్యాలయాల చుట్టూ తిరగారు. దరఖాస్తులకు, జిరాక్స్‌లకు, చార్జీలకు రెండు లక్షల రూపాయలు పైగానే ఖర్చు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రూ.6.36 లక్షలు మాత్రమే. ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్‌ హామీలతో తమను నమ్మించారని, నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని, ఇప్పటికే ఎకరాకు రూ.1.15 లక్షల పరిహారం తీసుకున్న బాధితులకు మరో రూ.5 లక్షలు చెల్లిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలను జగన్‌ విస్మరించారు. వరదల సమయంలో వేలేరుపాడు వచ్చిన సీఎం జగన్‌…బాధితులకు రెండు నెలల్లో పూర్తిస్థాయి ప్యాకేజీ అందిస్తామన్న హామీ కూడా నెరవేరలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img