జైలుశిక్ష తీర్పు అప్పీల్‌పై 13న విచారణ
గాంధీనగర్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కిందికోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్‌గాంధీ చేసిన అభ్యర్థనపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని వెల్లడిరచింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. మోదీ ఇంటిపేరును కించపరిచారన్న అభియోగాలపై రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల సూరత్ విచారణ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సోమవారం ఆయన గుజరాత్‌లోని సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంకాగాంధీ వెంట రాగా… ఆయన సూరత్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత నడుమ అక్కడకు చేరుకున్నారు. తన జైలుశిక్ష తీర్పును సవాలు చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసిన ఆయన మరో రెండు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలుశిక్షను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే, అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడిరచింది. పరువునష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 13వ తేదీన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో… ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిరది. అంతకుముందు రాహుల్‌కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, ఇతర సీనియర్ నేతలు సూరత్ విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. కోర్టు వెలుపల పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడారు. రాహుల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను సరిహద్దుల వద్దే పోలీసులు నిర్బంధించారు. కాగా అప్పీల్ చేసేందుకు వెళ్లిన రాహుల్ వెంట భారీగా పార్టీ శ్రేణులు తరలిరావడాన్ని బీజేపీ తప్పుపట్టింది. రాహుల్ మొదట ఓబీసీ వర్గాన్ని అవమానించారని, ఇప్పుడేమో కుటుంబం, పార్టీ నేతలతో కలిసి డ్రామా చేయడానికి కోర్టుకు వెళ్తున్నారని దుయ్యబట్టింది.