Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పారా హుషార్‌…!

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ‘బార్ల’ వేలం
ఎక్కడికక్కడే మద్యం సిండికేట్లు
బ విశాఖలో రూ.60 లక్షలకే లైసెన్స్‌
బిడ్డర్లు పోటీపడ్డ తిరుపతిలో రూ.కోటీ 56 లక్షలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా బార్ల లైసెన్సుల కోసం జరుగుతున్న బిడ్డింగ్‌ ప్రక్రియ అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అధికార పార్టీ నాయకుని అండ లేకుండా, వారి భాగస్వామ్యం లేకుండా వేలం పాటలో పాల్గొనే పరిస్థితి కానరావడం లేదు. బార్‌ లైసెన్స్‌ల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌, పారదర్శకమంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరిగే తంతుకి ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ దరఖాస్తుదారులను సిండికేట్‌ చేసి, వేలంలో పోటీ లేకుండా కారు చౌకగా బార్‌ లైసెన్స్‌ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావల్సిన వేల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. సహజంగా బార్‌లకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లైసెన్స్‌ ఫీజు పెంచి రెన్యువల్‌ చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం కల్పతరవు లాంటి మద్యాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కొత్త పాలసీని తెచ్చింది. ఈ పాలసీ ప్రకారం సెప్టెంబరు 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాల గడువుతో లైసెన్స్‌ మంజూరు చేయనున్నారు. అందుకోసం ఈనెల 21వ తేదీ నోటిఫికేషన్‌ జారీ చేసి, 30,31 తేదీల్లో ఆన్‌లైన్‌ వేలం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్లకు కొత్త లైసెన్స్‌ మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు లైసెన్స్‌ ఫీజులు వేర్వేరుగా నిర్ణయించారు. ఆ మేరకు తొలుత బిడ్డర్లు పోటీ పడ్డారు. మొత్తం 1,672 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అంత భారీ స్థాయిలో నమోదు కావడంతో ఎంత లేదన్నా వారిలో కనీసం 1,500 మంది రుసుములు చెల్లించి వేలంలో పాల్గొంటారని అందరూ భావించారు. కానీ అప్పుడే అధికార పార్టీ ఆపరేషన్‌ ప్రారంభమైంది. అంతే వేలం దగ్గరకు వచ్చేసరికి ఆ సంఖ్య 1,158 వద్దే ఆగిపోయింది. వారు కూడా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బార్‌ లైసెన్స్‌ కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజు నాన్‌ రిఫండబుల్‌ కాగా, దానితో పాటు స్థానిక ఎమ్మెల్యేకు జనాభా ఆధారంగా 10 నుంచి 25 లక్షలు చెల్లిస్తేనే వేలంలో సజావుగా వారికి పోటీ లేకుండా బార్‌ లైసెన్స్‌ దక్కే పరిస్థితి కల్పిస్తారు. తమను కాదని దరఖాస్తు చేసుకున్నవారికి బార్లు రావని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే హెచ్చరించడంతో అనేక దశాబ్దాలుగా వ్యాపారం చేసేవారు వారికి అనుకూలంగా వ్యవహరించగా, వారికి కప్పం చెల్లించలేని చాలామంది దరఖాస్తుదారులు వెనకడుగు వేశారు. బార్ల కోసం ముందుగా నమోదు చేసుకున్నవారి సంఖ్యతో పోలిస్తే దరఖాస్తు రుసుము చెల్లించిన వారి సంఖ్య అనూహ్యంగా పడిపోవడమే ఇందుకు నిదర్శనం. అధికార పార్టీ నేతలు పట్టించుకోని ప్రాంతాల్లో మాత్రమే వేలంలో బిడ్డర్లు పోటీ పడ్డారు. శనివారం జోన్‌-1, జోన్‌-4 అయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బిడ్లను తెరిచారు.
రాయలసీమలో అధికార పార్టీ నేతలకు చెందినవారే పోటీపడడంతో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. తిరుపతిలోని 16 బార్లకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించారు. తిరుపతిలో అత్యధికంగా రూ.1.59 కోట్లు, అత్యల్పంగా రూ.1.49 కోట్ల ధర పలికింది. అనంతపురంలోని ఓ బార్‌ కోసం రూ.1.09 కోట్లతో బిడ్‌ దాఖలు చేశారు. కడప జిల్లాలోని 27 బార్లకు ఈ వేలం నిర్వహించారు. కడపలోని ఓ బార్‌ కోసం అత్యధికంగా రూ.1.71 కోట్లకు, ప్రొద్దుటూరులోని ఓ బార్‌కు రూ.1.30 కోట్లతో బిడ్‌ దాఖలయింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో మద్యం సిండికేట్ల హవానే కొనసాగింది. దీంతో చాలా తక్కువ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. అనంతపురం లాంటి వెనుకబడ్డ జిల్లాలో కూడా ఒక్కొక్క బార్‌ కోటి రూపాయలకు పైగా వేలం ధర పలకగా, విశాఖ లాంటి మహానగరంలో గరిష్ఠంగా రూ.60 లక్షలకు బార్లు దక్కించుకోవడం అధికార పార్టీ నేతలు ఏవిధంగా చక్రం తిప్పారో స్పష్టమవుతోంది.
విచిత్రమేమిటంటే విశాఖ నగరంలో మొత్తం 128 బార్లకు ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులు ఆహ్వానించగా 120 బార్లకు మాత్రమే దరఖాస్తులు రావడం మరో విశేషం. దరఖాస్తులు వచ్చిన వాటిలో 119 బార్‌ లైసెన్స్‌లకు అధికారులు ఆమోదం తెలిపారు. ఇక ఆదివారం కోస్తా జిల్లాల్లో జరుగుతున్న వేలం ప్రక్రియకు కూడా అధికార పార్టీ నేతలు ఇప్పటికే దరఖాస్తుదారులను సిండికేట్‌ చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 110 బార్‌లుండగా, కేవలం అదే సంఖ్యలో దరఖాస్తు చేయడం సిండికేట్ల ప్రభావాన్ని తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img