Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పార్లమెంటులో ఆ పదాలు నిషేధం

ఎంపీలకు ఉత్తర్వులు జారీ

న్యూదిల్లీ: పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, ఇష్టమొచ్చినట్లు పదాలను వినియోగిస్తే ఊరుకునేది లేదని ఉభయ సభ ఎంపీలకు ‘గాగ్‌ ఆర్డర్‌’ జారీ అయింది. ‘జుమ్లా జీవి’, కొవిడ్‌ స్ప్రెడర్‌, స్నూప్‌ గేట్‌ లాంటి మాటలు మొదలుకొని, సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి, అసమర్థుడు వంటి పదాలు సైతం వాడేందుకు వీల్లేదని ఉత్వర్వులు పేర్కొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభం వేళ పార్లమెంటులో ఏయే పదాలను వాడకూడదో పేర్కొంటూ ఒక బుక్‌లెట్‌ను లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసింది. లోక్‌సభలో డ్రామా, హిపోక్రసీ, నియంత, శకుని, తానాషా, వినాశ పురుష్‌, ఖలిస్తానీ, ద్రోహచరిత్ర, చెంచా, చెంచాగిరి, పిరికివాడు, క్రిమినల్‌, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, విశ్వాస ఘాతకుడు వంటి పదాలను చట్టసభల సభ్యులు తమ ప్రసంగాల్లో వాడకూడదని స్పష్టంచేశారు. అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో ‘జుమ్లాజీవి, బైల్‌బుద్ధీ, కోవిడ్‌ స్ప్రెడర్‌, స్నూప్‌గేట్‌, అషేమ్‌డ్‌, అబ్యూజ్డ్‌, డ్రామా, బిట్రేయ్‌డ్‌, కరప్ట్‌, హిపోక్రసీ, ఇన్‌కాంపిటెంట్‌, శకుని, తానాశాహీ, వినాశ్‌పురుశ్‌, జైచంద్‌, ఖలిస్తానీ, ఖూన్‌ కే ఖేతీ, డిక్టేటర్‌, డిక్టేరోరియల్‌, అనార్కిస్ట్‌, ద్రోహచరిత్ర, నికమ్మా, నౌటంకీ, దిన్‌దోరా పీట్‌నా, బెహరీ సర్కార్‌’ వంటివి ఉన్నాయి. వీటిని సభలో ఉపయోగిస్తే రికార్డుల నుంచి తొలగించడంతో పాటు సభాపతి ఆ పదాలు వాడిన వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా, ఏ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలన్న అధికారం ఉభయ సభాపతులకు ఉంటుంది. జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం విదితమే.
ఇవి కొత్త సిఫార్సులు కాదు
ప్రతిపక్షాల మండిపాటు క్రమంలో ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ ఇవేమీ కొత్త సిఫార్సులు కాదని, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల్లో వాడకూడదని నిర్దేశించినవేనని సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. కామన్‌వెల్త్‌ దేశాల్లో అన్‌పార్లమెంటరీగా పరిగణించే పదాలూ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. వాస్తవాలు తెలియకుండా విపక్షాలు రభస చేస్తున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ జాబితా ప్రతి ఏడాది వెలువడుతుందని అన్నారు. యూపీఏ హయాంలోనూ ఇందులో చాలా పదాలు ‘అన్‌పార్లమెంటరీ’గానే పరిగణించారని చెప్పారు.
సభ్యుల హక్కులు హరించలేదు: స్పీకర్‌ ఓం బిర్లా
పార్లమెంటులో మాట్లాడేందుకు వినియోగించే పదాల్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధించ లేదని, కొన్ని పదాలను మాత్రమే తొలగించామని, తొలగించిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామని, సభా సౌలభ్యాన్ని కొనసాగిస్తూ సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిరచ వచ్చని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. గతంలో అన్‌పార్లమెంటరీ పదాలను పుస్తకం రూపంలో విడుదల చేసేవారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెట్టామన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిరచే హక్కును ఎంపీల నుంచి ఎవరూ హరించలేదని అన్నారు. పార్లమెంటరీ పద్ధతులపై అవగాహన లేని వారు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఉపయోగించే పదాలను మాత్రమే తొలగించలేదని, వాటిని అధికార పక్షం వారూ వినియోగిస్తున్నారని బిర్లా తెలిపారు. నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని విపక్షాలనుద్దేశించి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img