Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

పార్లమెంటు కొత్త భవనం నేడే ప్రారంభం

సర్వం సిద్ధం` కట్టుదిట్టమైన భద్రత
ఏకపక్షంగా ముందుకెళుతున్న మోదీ

న్యూదిల్లీ: పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వైభవంగా వేడుక నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతికి బదులు ప్రధాని ఈ భవనాన్ని ప్రారంభించడాన్ని 20 ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి హక్కును నిరాకరిస్తూ ఏకపక్షంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించాయి. ప్రారంభో త్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాజదండాన్ని ప్రతీష్టించనుండటం కూడా వివాదాస్పదమైంది. నాడు బ్రిటిష్‌ నుంచి అధికార బదిలీకి చిహ్నంగా రాజదండాన్ని నూతన పార్లమెంటులో పెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనిని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నాయి. బ్రిటిష్‌ నుంచి భారత్‌కు అధికార బదిలీకి చిహ్నంగా రాజదండాన్ని ఇచ్చినట్లు లార్డ్‌ మౌంట్‌బాటెన్‌, సి.రాజగోపాలాచారి, జవహర్‌ లాల్‌ నెహ్రూ ధ్రువీకరించినట్లు ఎలాంటి పత్రాలు లేవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తాము లేవనెత్తే ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలను కేంద్రం ఇవ్వదని, ప్రజాసమస్యలను పట్టించుకోదని, కీలకాంశాలను నిర్లక్ష్యం చేస్తున్నదని వామపక్షాలతో సహా విపక్షాలు ఘాటుగా విమర్శించాయి. రాష్ట్రపతికి మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. లేనిపక్షంలో బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టంచేశాయి. ఇదిలావుంటే, పార్లమెంటు భవనాన్ని ప్రజాస్వామ్య ఆలయంగా ప్రధాని మోదీ వర్ణించారు. కొత్త పార్లమెంటు భవనం చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో విరివిగా పంచుకుంటూ మా పార్లమెంటు మాకు గర్వకారణం అని పోస్టులు పెట్టాలని కోరారు. భారతాభివృద్ధికి, కోట్లాది మంది సాధికారతకు ఈ ప్రజాస్వామ్య ఆలయం దోహదమవ్వాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం వివరాలు
ఆదివారం ఉదయం 7.30 గంటలకు పూజ, హోమంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత లోక్‌సభ చాంబర్‌లో రాజదండాన్ని స్థాపిస్తారు. సర్వమతాల ప్రార్థనల అనంతరం పార్లమెంటుపై రూపొందించిన రెండు లఘుచిత్రాలు ప్రదర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో సభ మొదలవుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ సందేశాలను చదివి వినిపిస్తారు. స్పీకర్‌ ఓం బిర్లా తదితరుల ప్రసంగాల తర్వాత రూ.75 నాణెం, స్టాంపును విడుదల చేసిన తర్వాత మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, 18 ఎన్డీయే మిత్రపక్షాలు, ఏడు ఎన్డీయేతర (జేడీఎస్‌, ఎస్‌ఏడీ, బీఎస్పీ, లోక్‌జనశక్తి, బీజేడీ, టీడీపీ, వైసీపీ) పార్టీల నాయకులు హాజరు కానున్నారు. 60 మంది మతపెద్దలను ఆహ్వానించారు. రాజదండం స్థాపన కోసం తమిళనాడు నుంచి దిల్లీకి వేర్వేరు అధీనమ్‌ల మఠాధిపతులు చేరుకున్నారు. తిరువ్రాదుథురై అధీనమ్‌ ప్రతినిధులు కూడా వచ్చేశారు. వీరు రాజదండాన్ని మోదీకి అందజేసినట్లు సమాచారం.
రూ.75 నాణెం ఆవిష్కరణ
కొత్త భవన ప్రారంభోత్సవానికి సూచికగా రూ.75 స్మారక నాణెన్ని మోదీ విడుదల చేస్తారు. ఈ మేరకు గెజెట్‌ నోటిఫికేషన్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ జారీచేసింది. ఈ నాణెం బరువు 34.65 గ్రాములు లేక 35.35 గ్రామాలు ఉంటుందని పేర్కొంది. నాణెం ఒకవైపు అశోకస్థూపం, మూడు సింహాలు, మధ్యలో దేవనాగరి లిపిలో ‘భారత్‌’ అని, ఆంగ్లంలో ఇండియా అని ఉంటాయి. దాని కింద రూపాయి గుర్తు, 75 రూపాయలని ఉంటుంది. నాణెం రెండో వైపు పార్లమెంటు భవనం చిత్రం, ‘2023’ (సంవత్సరాన్ని సూచిస్తూ) ముద్రించివుంటాయి.
భారీ భద్రతా ఏర్పాట్లు
దిల్లీలో భారీస్థాయిలో భద్రతా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షల జారీ అయ్యాయి. పార్లమెంటు ఉన్న ప్రాంతంలో హైసెక్యూరిటీ ఉన్నాగానీ అదనపు బలగాలను మోహరించి సీసీటీవీ ద్వారా నిఘాను పెంచినట్లు పోలీసులు తెలిపారు. జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా మహిళా మహాపంచాయత్‌ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని పోలీసు అధికారి చెప్పారు. సెంట్రల్‌ దిల్లీలో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల వద్ద తనిఖీ చేసి వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img