. ప్రజాస్వామ్య ఆత్మలేని కొత్త భవనానికి విలువ ఉండదు
. ప్రధాని తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
. రాష్ట్రపతికి ఘోర అవమానం
. 19 విపక్ష పార్టీల సంయుక్త ప్రకటన
న్యూదిల్లీ: పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, టీఎంసీ సహా 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రజాస్వామ్య ఆత్మే లేనప్పుడు పార్లమెంటుకు విలువు ఉండదని వ్యాఖ్యానించాయి. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ముర్ముకు బదులు ప్రధాని మోదీ ప్రారంభించాలనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించాయి. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారని ఆందోళన వ్యక్తంచేశాయి. ఈనెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
‘ప్రజాస్వామ్యాన్ని కేంద్రప్రభుత్వం ఖూనీ చేస్తోంది. పార్లమెంటు కొత్త భవనం నిర్మాణ తీరు ఆమోదయోగ్యం కాదు. అయినప్పటికీ మా మధ్య విభేదాలను పక్కన పెట్టి ప్రారంభోత్సవానికి రావాలని భావించాం. కానీ రాష్ట్రపతికి బదులు ప్రధాని ప్రారంభించనుండటం అవమానకరమే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి కూడా’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజాస్వామ్యం ఆత్మలేని పార్లమెంటుకు విలువ ఉండదని, అందుకే ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచాయి. అప్రజాస్వామిక చర్యలు మోదీ ప్రభుత్వానికి కొత్తేమీ కాదనీ, ఆయన పార్లమెంటును గుల్ల చేశారని విమర్శించాయి. నిరంకుశ ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ప్రతిఘటిస్తామని తేల్చిచెప్పాయి. తమ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళతామని ప్రకటించాయి. సాగుకు సంబంధించి మూడు వివాదాస్పద చట్టాలను చర్చలు లేకుండా ఆమోదింపజేయించి పార్లమెంటు కమిటీలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డాయి. రాష్ట్రపతి కేవలం దేశాధిపతే కాదు…పార్లమెంటు అంతర్గత భాగం కూడా, ఉభయసభలను ఆమె శాసించగలరని పేర్కొన్నాయి. రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు పనిచేయలేదని, ఇది తెలిసినప్పటికీ రాష్ట్రపతికి బదులు ప్రధానమంత్రి కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం సహేతుకం కాదని వెల్లడిరచాయి. ఈ చర్య రాష్ట్రపతి ప్రతిష్ఠతో పాటు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే అవుతుందని ప్రతిపక్షాలు తేల్చిచెప్పాయి. శతాబ్దంలో ఒక్కసారి సంభవించే మహమ్మారి వేళలో అత్యధిక వ్యయంతో పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించారు. దీని గురించి దేశ ప్రజలనుగానీ ఎంపీలనుగానీ సంప్రదించలేదని దుయ్యబట్టాయి. రాజ్యాంగంలోని అధికరణ 79 ప్రకారం కేంద్రం కోసం పార్లమెంటు ఉంటుంది. అందులో రాష్ట్రపతి, రెండు సభలు ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ది పీపుల్’ ఉంటాయి అని ప్రతిపక్షాల సంయుక్త ప్రకటన పేర్కొంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏకతాటిపైకొచ్చిన పార్టీల్లో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, ఆప్, ఎన్‌సీపీ, ఎస్‌ఎస్(యూబీటీ), ఐయూఎంఎల్, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీ, కేసీ(ఎం), ఆర్‌ఎస్‌పీ, వీసీకే, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌డీ ఉన్నాయి. అయితే పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రావాలో లేదో ఇంకా నిర్ణయించలేదని బీఎస్పీ వెల్లడిరచింది. టీడీపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే, వైఎస్‌ఆర్‌సీపీ కూడా నిర్ణయాన్ని తెలుపలేదు. తాము దీనిపై గురువారం నిర్ణయిస్తామని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మేమొస్తామని శిరోమణి అకాలీ దళ్ తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం జరగని పక్షంలో కార్యక్రమానికి ఏఐఎంఐఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడిరచారు.
ఇదిలావుంటే, ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందిస్తూ ‘అన్ని రాజకీయ పార్టీలకు కేంద్రప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. దానికి ఎలా స్పందించాలన్నది వారి విజ్ఞతకే వదిలేశాం’ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం దురదృష్టకరం, వారి దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నా అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. లేని సమస్యను సృష్టించవద్దని, కార్యక్రమానికి రావాలని ప్రతిపక్షాలను కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ ‘రాష్ట్రపతి చేతుల మీదగా పార్లమెంటు కొత్త భవన ప్రారంభం జరగడం లేదు. కనీసం ఆమెను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిని ఘోరంగా అవమానించారు. పార్లమెంటు అంటే అహకార ఇటుకల నిర్మాణం కాదు రాజ్యాంగ విలువ నిలయం’ అని అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘పార్లమెంటులో ప్రజాస్వామ్య షెహనాయి మోగాలి కానీ స్వీయప్రకటిత విశ్వగురువు వచ్చాక నిరంకుశత్వం కొనసాగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘మార్చుకోవాల్సింది ఉద్దేశాన్ని… భవనాన్ని కాద’ని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఆమెను అగౌరవపర్చడమే కాకుండా ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ ట్వీట్‌చేసింది. భారత రాష్ట్రపతి నంబర్ వన్ కాగా ఉపరాష్ట్రపతి తర్వాత మూడో స్థానంలో ప్రధాని ఉంటారు. రాజ్యాంగ సూత్రాలనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇదేమీ మోదీ గృహ ప్రవేశం కాదు. ఆయన సొంత డబ్బుతో కట్టుకున్న ఇల్లు కాదు’ అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ రaా స్పందిస్తూ ప్రధాని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఎవరి మాట వినిపించుకోరు. రాజ్యాంగం ప్రకారం కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి’ అని అన్నారు. 2020 డిసెంబరులో పార్లమెంటు భవనానికి జరిగిన శంకుస్థాపననూ ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం విదితమే.