Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పీడీఎఫ్‌ అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓటు

టీడీపీ నిర్ణయం: అచ్చెన్నాయుడు

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. మేధావులు, పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి… ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది తర్వాత బకాయిలు చెల్లిస్తామని మంత్రులు కమిటీ కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ మాటలు నమ్మాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జులు, అధ్యక్షులతో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. నాలుగేళ్లలో ఐదు కోట్ల ప్రజల వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం వైసీపీనేనని అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలన మినహా ఇతరులు ఉండరాదన్న సీఎం జగన్‌ కల నెరవేరదని తెలిపారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు జగన్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. జగన్‌ పాలనలో ప్రతిపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, దౌర్జన్యాలు చేయడం సర్వసాధారణమైందన్నారు. టీడీపీని లేకుండా చేయాలన్న జగన్‌ కల నెరవేరబోదని స్పష్టంచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 160 సీట్లతో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. దిల్లీలో వంద కోట్ల మద్యం కుంభకోణానికే ఎంతోమందిని అరెస్టు చేసిన కేంద్ర ప్రభుత్వం…ఇక్కడ 4వేల కోట్లరూపాయల కుంభకోణం జరిగితే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓట్లతో గెలవడానికి వైసీపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు టీడీపీ అభ్యర్థులకు, రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని, దీనిని అందరూ అమలు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి రవీంద్ర, కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీమంత్రులు కేఈ ప్రభాకర్‌, ఫరూక్‌, ఏరాసు ప్రతాపరెడ్డి, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బీవీ నాగేశ్వరరెడ్డి, సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, ఇన్‌చార్జిలు కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, ధర్మారం సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img