Friday, June 9, 2023
Friday, June 9, 2023

పుట్టపర్తిలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..

సత్యసాయిధామం పుట్టపర్తిలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రశాంతి నిలయం ఉన్న పుట్టపర్తిలో రాజకీయ ఘర్షణలు చెలరేగాయి. అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణలతో పుట్టపర్తి అట్టుడికింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ నాయకులు రోడ్లపైకి వచ్చారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పుట్టపర్తిని అభివృద్ధి చేసింది తామేనని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పల్లె వ్యాఖ్యలను ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి తప్పుబట్టారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దీంతో తేల్చుకుందామంటూ ఇద్దరు నాయకులు సవాల్‌ విసురుకున్నారు. దీనికి వేదికగా పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయాన్ని ఎంచుకున్నారు. అన్నట్టుగా మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తన అనుచరులతో సత్యమ్మ ఆలయానికి చేరుకున్నారు. అటు ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో కారుపైకి ఎక్కిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తేల్చుకుందాం రండి అటూ తొడగొట్టి సవాల్‌ విసిరారు. అటు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

సత్యసాయి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు సెక్షన్‌ 30 అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని నాయకులను కోరారు. సత్యమ్మ గుడి దగ్గర ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతించమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img