Friday, August 19, 2022
Friday, August 19, 2022

పెట్టుబడులే లక్ష్యం

దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు సీఎం జగన్‌
22 నుంచి 26 వరకు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ
గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సీఎస్‌, డీజీపీ
ఏపీకున్న వనరులు, కీలక రంగాల్లో ప్రగతిని వివరించనున్న సీఎం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా జరగనుంది. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు జరిగే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొననున్నారు. సీఎం జగన్‌ శుక్రవారం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. ఈసందర్భంగా సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు. సీఎం శుక్రవారం రాత్రికే దావోస్‌ చేరుకోనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. ఐదు రోజులు జరిగే సదస్సులో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో సీఎం తెలియజేస్తారు. బెంగళూరు-హైదరాబాద్‌, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. సుశిక్షితులైన మానవవనరుల నైపుణ్యాలను అభివృద్ధిచేస్తున్న తీరునుకూడా వివరిస్తారు. అలాగే కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం బృందం వివరించనుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్‌ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్‌ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.పీపుల్‌-ప్రోగ్రెస్‌-పాజిబిలిటీస్‌ నినాదంతో ఈ పెవిలియన్‌ నిర్వహిస్తోంది. పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపైనా కూడా దావోస్‌ వేదికగా ఏపీ దృష్టిసారించనుంది. నేరుగా ఇంటి గుమ్మం వద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతంచేయడం, దీన్ని డిజిటలైజేషన్‌తో అనుసంధానం చేయడం, రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధిచేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారుచేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధిచేయడం లాంటి అంశాలపై అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై కూడా ఈ సదస్సులో ఏపీ దృష్టిపెట్టనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img