వైరస్ నుంచి కోలుకున్న వారిలో ఛాతి, శ్వాసకోశ సమస్యలు
దీర్ఘకాలంలో హృద్రోగాలకు కారణమవుతున్నయ్..
హార్వార్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్న పరిశోధకులు
నిన్నమొన్నటి దాకా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గినా కూడా దాని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న గుండె జబ్బుల కేసులకు కారణం కరోనా ఎఫెక్టేనని అనుమానిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. చాలా మంది గుండె పోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 10 నుంచి 15 శాతం దాకా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. హర్వార్డ్ పరిశోధకుల అధ్యయనం కూడా ఇదే రకమైన ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జరిపిన మరో అధ్యయనంలో.. 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులలో హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య 29.9 శాతం పెరిగిందని తేలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెలలు గడిచినా కూడా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, మైకం కమ్మడం తదితర సమస్యలు వీడడంలేదని పరిశోధకులు చెప్పారు. ఈ సమస్యలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయని సందేహిస్తున్నట్లు తెలిపారు. అయితే, హృద్రోగ బాధితుల సంఖ్య పెరగడానికి ఇప్పటికైతే స్పష్టమైన కారణం తెలియదని, ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.