Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పేట్రేగిన మట్టి మాఫియా

రాత్రికి రాత్రే అక్రమ తవ్వకాలు
చేపల చెరువులవుతున్న సాగు భూములు
కలిదిండి మండలంలో బరితెగింపు

విశాలాంధ్ర బ్యూరో`ఏలూరు: అధికార పార్ఠీ ప్రజా ప్రతినిధులు, అధికారుల అండ చూసుకొని ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో అక్రమ పద్ధతుల్లో పంట పొలాలను చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఇందుకోసం తవ్విన మట్టి, ఇసుకను గ్రామాల నుంచి వందలాది టిప్పర్లలో తరలించేస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రజా ప్రతినిధుల స్వార్థం, అధికారుల అవినీతి పరాకాష్ఠకు చేరుకోవడంతో పచ్చటి పొలాలు, ధాన్యం రాశులతో కళకళలాడే డెల్టా ప్రాంతాలు చేపల చెరువులుగా మారిపోతున్నాయి. ఫలితంగా గ్రామాలలోని పచ్చని పొలాలు కనుమరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై అధికార యంత్రాంగం నియంత్రణ లేకపోవడంతో భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, భూగర్భం బలహీనపడే అవకాశం ఉంది. తమ మద్దతుదారులకు కనక వర్షం కురిపించడమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం పై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. చేపల సాగు కనక వర్షం కురిపిస్తుండడంతో జిల్లాలో చెరువుల తవ్వకాలు ఏటా కొనసాగుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి నేపథ్యంలో రైతులు కూడా చేపల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పంట భూములు సైతం చేపల చెరువులుగా మారిపోతున్నా, అక్రమ తవ్వకాలు మితిమీరుతున్నా, వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, మత్స్య శాఖల అధికారులు మామూళ్లు అందుకుంటూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్వా జోన్‌ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. మత్స్యశాఖ, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల మద్దతుతో రాత్రికి రాత్రే చెరువులు యధేచ్ఛగా తవ్వేస్తున్నారు. జిల్లాలో వేలాది ఎకరాలలో కొందరు పెద్దలు అక్రమంగా చెరువులు తవ్వి చేపల సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం పంచాయతీ ఆరుతెగలపాడులో మంచినీటి చెరువుని ఆనుకుని విచ్చలవిడిగా చెరువులు తవ్వుతున్నారు. గోపాలపురం, సాన రుద్రవరం, వెంకటాపురం, కోరుకొల్లు గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా గరువు పంట పొలాలను చేపల చెరువులుగా మారుస్తున్నారు. మట్టి మాఫియా మట్టిని టిప్పర్ల ద్వారా రియల్‌ ఎస్టేట్‌ స్థలాలకు తరలిస్తున్నారు. పుంతలను కలుపుకొని చెరువులు తవ్వేస్తున్నా… అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నారు. మండల సరిహద్దు రాళ్లు సైతం తీసి పొలాలను చెరువులుగా మారుస్తున్నారు.
అనుమతి లేకుండానే…
వ్యవసాయ భూముల్ని ఆక్వా చెరువులుగా మార్చుకోవాలంటే రెవెన్యూ, మత్స్యశాఖ అనుమతులు తీసుకోవాలి. అనుమతి లేనిచోట మట్టిని తవ్వుతున్న అక్రమార్కులను స్థానికులు అనేక సందర్భాలలో అడ్డుకోగా , ప్రశ్నించిన వారిపై మట్టి మాఫియా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క గోపాలపురం గ్రామంలోనే 10 మంది వరకు మైనింగ్‌ డాన్లు తిష్ట వేసినట్లు సమాచారం.
స్పందనలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
చేపల చెరువుల తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు స్పందనలో ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవు. సారవంతమైన మాగాణి భూములు వరి సాగుకు పనికిరానివిగా ప్రభుత్వ అధికారులు ధృవీకరిస్తున్నారని, వ్యవసాయానికి అనుకూలం కాదంటూ చెబుతూ జిల్లా స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ చేపల చెరువులుగా అనుమతులు మంజూరు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు పంటలు పండే మాగాణి భూములు సైతం చేపల చెరువులుగా మారాయి.
నిబంధనలు అమలు ఎక్కడ ?
వ్యవసాయానికి పనికిరాని భూములు, బీడు భూములు, తరచూ ముంపుకు గురయ్యే భూములలో మాత్రమే చేపల చెరువులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం నూతనంగా ఆక్వా జోన్లను ఏర్పాటు చేసింది. ఆ జోన్‌ పరిధిలో ఉన్న చెరువులకు మాత్రమే ప్రభుత్వ రాయితీలు అందుతాయి. కొత్తగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వాలంటే జిల్లా స్థాయి కమిటీ నుంచి అనుమతి పొందాలి. జిల్లాస్థాయి కమిటీ సమీక్షించిన తరువాత గ్రామస్తులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వందల ఎకరాలను అనధికారికంగా చెరువులుగా మారుస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే తమ దృష్టికి రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఫిర్యాదులు చేసినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img