Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

పేదల పక్షపాతి విశాలాంధ్ర

సమాజ ప్రగతిలో కమ్యూనిస్టు పత్రికల పాత్ర కీలకం

ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి
నవ సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలి
విశాలాంధ్ర 70వ వార్షికోత్సవ సభలో వినయ్‌ విశ్వం

విశాలాంధ్ర`విజయవాడ:
దేశంలో పత్రికలకు వార్షికోత్సవాలు కొత్తమే కాదనీ, నిస్వార్థంగా పేదల పక్షాన, సోషలిజం, ప్రజాస్వామ్య పక్షపాతిగా ఏడు దశాబ్దాలుగా నిరాటంకగా కొనసాగుతున్న విశాలాంధ్ర 70వ వార్షికోత్సవం ప్రత్యేకమైనదని, స్ఫూర్తిదాయకమైనదని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వినయ్‌ విశ్వం అన్నారు. విశాలాంధ్ర దినపత్రిక 70వ వార్షికోత్సవ సభ బుధవారం సాయంత్రం నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో వినయ్‌ విశ్వం మాట్లాడుతూ తాను కూడా కమ్యూనిస్టు జర్నలిస్టుగా పని చేశానన్నారు. కేరళలో జనయుగం మలయాళ పత్రికకు అతిచిన్న వయసులోనే సంపాదకుడి బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్న ఆంగ్ల పత్రిక న్యూఏజ్‌కు సంపాదకుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. రష్యాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పత్రికలు ప్రజల చైతన్యం, సమాజ ప్రగతిలో చరిత్రాత్మక పాత్ర పోషించాయని ఆయన వివరించారు. కమ్యూనిస్టు పత్రికలు కేవలం వార్తలకు మాత్రమే పరిమితం కావని, సమాజ మార్గనిర్దేశకులుగా పనిచేస్తాయని చెప్పారు. కమ్యూనిస్టు పత్రికలకు పోలీసులు, ప్రభుత్వాలు, పాలకవర్గాల నుంచి ప్రతిఘటనలు, న్యాయ, ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తాయని, అయినా ప్రజలు, వామపక్ష ఉద్యమ అభిమానులు, శ్రేయోభిలాషుల అండదండలు, ఆదరణతో కొనసాగుతున్నాయని వినయ్‌ విశ్వం తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం విపక్ష పార్టీలకు అర్థమైందని, వాటిని అడ్డుకునేందుకు 17 పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హాను ఎంపిక చేశాయని తెలిపారు. బీజేపీ తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం కేవలం గిరిజన మహిళకు అత్యున్నత పదవి ఇస్తున్నామనే ప్రచార ఆర్భాటం కోసమేనని విమర్శించారు. మహిళలను గౌరవించే తత్వం ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏనాడు లేదని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద భావజాలాన్ని అడ్డుకునేందుకు దేశ ప్రయోజనాల కోసం విశాల దృక్పథంతో సీపీఐ సహా 17 పార్టీలు కృషిచేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత విశాలాంధ్ర వంటి కమ్యూనిస్టు పత్రికలపై ఉందన్నారు. తద్వారా నవసమాజ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
విశాలాంధ్ర ఓ సంస్కర్త: ఏటుకూరి
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ మాజీ ఎడిటర్‌ ఏటుకూరి ప్రసాద్‌ మాట్లాడుతూ విశాలాంధ్ర దినపత్రికను ఓ సంస్కర్తగా అభివర్ణించారు. అన్ని రంగాల్లో ఉన్న చెడును చూపించి, దానిని తొలగించడం ద్వారా సమాజానికి ఏ విధంగా మంచి చేయాలో చూపించడం విశాలాంధ్ర ప్రత్యేకతని తెలిపారు. విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచే పత్రిక కోసం పని చేశానని గుర్తుచేశారు. అనేక మంది ప్రముఖులు తమ ఆస్తులను త్యాగం చేసి ఈ పత్రికను స్థాపించారని చెప్పారు. ప్రజల నాడి పట్టుకుని పత్రికను నడిపించారని, ప్రారంభం నుంచి ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీకగా విశాలాంధ్ర నిలిచిందని పేర్కొన్నారు. గతంలో మద్రాస్‌ నుంచి అన్ని పత్రికలు వచ్చేవని, విశాలాంధ్ర మాత్రం విజయవాడ నుంచి ప్రచురితమయ్యేదని, అందువల్ల ఏ రోజు పత్రిక ఆరోజే అందుబాటులో ఉండేదని తెలిపారు. తాము గుంటూరులో ‘విశాలాంధ్ర రేపటి పత్రిక`ఈరోజే’ అని చెబుతూ పంపిణీ చేసేవారమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కోసం విశేష కృషి చేసిందన్నారు. వందలాది మంది పాత్రికేయులు, రచయితలను విశాలాంధ్ర సృష్టించిందని తెలిపారు. సమాజానికి చేటుచేసేవారి భావజాలాన్ని అడ్డుకోవడం, అభ్యుదయ, వామపక్ష భావజాలాన్ని, శాస్త్ర, సాంకేతిక ప్రగతిని ప్రజలకు తెలియజేయడం ఈ పత్రిక లక్ష్యమని పేర్కొన్నారు. విశాలాంధ్ర మరోసారి తన మూలాల్లోకి వెళ్లి సరైన దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
విశాలాంధ్ర ఎవరికీ బెదరదు: రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాలాంధ్ర పత్రిక వ్యవస్థాపకులు రాష్ట్రంలోనే నాడు ప్రముఖులని, ఆ మహనీయుల కృషి, అంకితభావం వల్లే నేటికీ కొనసాగుతోందని చెప్పారు. మీడియాను కార్పొరేట్లు శాసిస్తున్నారని, అన్ని భాషల్లోనూ మీడియా సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టానుసారం ఆడిస్తున్నారని విమర్శించారు. కష్టజీవులు, ప్రజల కోసం నిలిచే పత్రికలు, చానళ్ల అవసరం ఉందన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సిసలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తోందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉందని, 2024లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని సైతం మార్చివేస్తారని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తూ విశాలాంధ్రకు ప్రకటనలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అంటే సీఎం జగన్‌ సొంత ఆస్తి కాదని, 70 ఏళ్ల చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు..వెళ్లారని, ఎవరూ శాశ్వతం కాదన్నారు. 70ఏళ్లుగా విశాలాంధ్ర నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందన్నారు. తెలుగునాట సామాజిక చైతన్యం, సాంస్కృతిక పునజ్జీవానికి విశాలాంధ్ర అందించిన సేవల గురించి ఏమాత్రం తెలియని ముఖ్యమంత్రి..తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా అణచివేస్తామనే ధోరణిలో ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదన్నారు. ఎవరి బెదిరింపులకు విశాలాంధ్ర అదరదు, బెదరదని స్పష్టంచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా పత్రికను కాపాడుకుంటామని చెప్పారు. విశాలాంధ్రను కాపాడుకునేందుకు లౌకికవాదులు ముందుకు రావాలని కోరారు.
పెద్దల లక్ష్యానికి అనుగుణంగా నడిపిస్తాం: జల్లి విల్సన్‌
విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ విశాలాంధ్రను ఏ లక్ష్యం కోసమైతే పెద్దలు స్థాపించారో, దానికి అనుగుణంగా నడిపిస్తామని చెప్పారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విశాలాంధ్ర పాటుపడుతోందని తెలిపారు. విశాలాంధ్రతో తనకు చిన్నప్పటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉందని, స్వర్ణోత్సవాలు, 60, 70వ వార్షికోత్సవంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నామని విశాలాంధ్రపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ప్రకటనలు ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని చెప్పారు. అయినా పెద్దల స్ఫూర్తి, ఉద్యోగుల సహకారం, వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో అనేక సమస్యలు వచ్చినా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక్క రోజు కూడా పత్రిక ఆగకుండా నడిపామని పేర్కొన్నారు.
ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించాలి: గడ్డం కోటేశ్వరరావు
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ గడ్డం కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కల్పించడం, హేతుబద్ధతతో కూడిన ఆలోచనలు పెంపొందించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పులను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా విశాలాంధ్ర పత్రికను స్థాపించారని తెలిపారు. విశాలాంధ్రలో అతి తక్కువ వేతనాలు తీసుకుని పూర్తిస్థాయి కార్యకర్తలుగా పని చేశారని గుర్తుచేశారు. విశాలాంధ్రలో పని చేసేవారిని ఉద్యోగులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు.
70 ఏళ్ల చరిత్ర విశాలాంధ్ర సొంతం: ఆర్వీ రామారావ్‌
విశాలాంధ్ర ఎడిటర్‌ ఆర్వీ రామారావ్‌ మాట్లాడుతూ తెలుగులో దినపత్రికలు చాలా వచ్చినా 70 ఏళ్ల చరిత్ర ఏ ఒక్కదానికి లేదని చెప్పారు. తెలుగు నేలపై పుట్టిన విశాలాంధ్ర అనేకమంది పాత్రికేయులు, ఎడిటర్లను సృష్టించిందని తెలిపారు. ప్రజల పక్షపాతిగా, నిరాపేక్షగా ఉండటం విశాలాంధ్ర ప్రత్యేకతని పేర్కొన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కోశాధికారి జి.ఓబులేశు, సభ్యులు పి.దుర్గాభవానీ, పీవీ మల్లికార్జునరావు, డీజీఎం టి.మనోహర్‌నాయుడు పాల్గొనగా, విశాలాంధ్ర జీఎం పి.హరినాథరెడ్డి స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు వందన సమర్పణ చేశారు. విశాలాంధ్ర ప్రత్యేక సంచికను వినయ్‌ విశ్వం ఆవిష్కరించారు.
ప్రముఖులకు సన్మానం
విశాలాంధ్ర మాజీ జనరల్‌ మేనేజర్‌ వై.చెంచయ్య, మాజీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఎస్‌కే బాబును ముప్పాళ్ల నాగేశ్వరరావు, జల్లి విల్సన్‌, పి.హరినాథరెడ్డి, గడ్డం కోటేశ్వరరావు సన్మానించి జ్ఞాపికలు అందించారు. అనంతరం విజ్ఞాన సమితి బాధ్యులను కూడా నాయకులు సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img