Monday, September 26, 2022
Monday, September 26, 2022

పేదల పొట్టకొట్టి… పెద్దలకు పంచారు

. బీజేపీ ‘నమో కార్పొరేటీకరణ’
. కార్పొరేట్లకు 1.84 లక్షల కోట్లపన్ను రాయితీ
.బడాబాబులకు రెండేళ్లలో దోచిపెట్టిన కేంద్రం
.పేదల ఆహారంపై మాత్రం భారీగా జీఎస్‌టీ
. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలపై అసంతృప్తి జ్వాలలు
. జీవన ప్రమాణాలు క్షీణించాయంటున్న ప్రజలు

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘కార్పొరేట్‌’లకు మోకరిల్లింది. కాషాయ పాలకులు ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ రేట్లు, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వంటి అస్తవ్యస్థ ఆర్థిక చర్యలతో పేదల నడ్డివిరిచారు. ఇటీవల ఆహార పదార్ధాల పైనా జీఎస్‌టీని పెంచేశారు. పేదల ఆహారమైన బియ్యం, నూకలపై కూడా ఎడాపెడా పన్నులు వేయడంతో వారి జీవన ప్రమాణాలు తీవ్రంగా దిగజారాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీల రూపంలో లక్షల కోట్లు దోచి పెడుతున్నది. రెండేళ్లలో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ద్వారా ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు బడాబాబులకు లబ్ధిచేకూర్చినట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం బయటపెట్టింది. పేదలకు సంక్షేమ పథకాలు కూడా అమలుచేయొద్దని షరతులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల పై మాత్రం అంతులేని కరుణ చూపిస్తున్నది.
ఈ ఏడాది లక్షల కోట్లకు పైగానే…
కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలకు రెండేళ్ల క్రితం పన్ను రాయితీలు ప్రకటించింది. దీనివల్ల 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.87,835 కోట్లు, రూ.2020-21లో రూ.96,400 కోట్ల కార్పొరేట్‌ పన్ను రాబడి తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం లక్ష కోట్లకుపైగానే ఉంటుందని పార్లమెంటరీ ప్యానల్‌ అంచనా వేసింది. ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 115 బీబీఏ కింద కార్పొరేట్‌ కంపెనీల నుంచి 2019-20లో కేంద్రానికి రూ.9.33 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్‌ ప్రకారం ఇందులో నుంచి కంపెనీలకు రూ.1.45 లక్షల కోట్లు వెళ్లాయి. సెక్షన్‌ 115 బీఏబీ కింద మొత్తం ఆదాయం రూ.35.13 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలు పొందిన కంపెనీలు దేశంలోని మొత్తం కంపెనీల్లో 15.85 శాతం మాత్రమే ఉండగా, రాయితీ పన్ను మొత్తంలో ఈ కంపెనీలకు ఏకంగా 62 శాతం వెళ్లటం గమనార్హం.
ఉద్యోగాల కల్పన ఏదీ…?
దేశీయ కంపెనీలు విదేశీ పోటీని తట్టుకొని నిలబడేందుకు, దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే పన్ను రాయితీ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంత భారీ మొత్తంలో రాయితీలు ఇచ్చినప్పుడు కంపెనీలు వ్యాపారాలను విస్తరించి భారీగా ఉద్యోగాలు కల్పించాలి. కానీ దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నదని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ కుంగిపోతున్నదని ప్రభుత్వ నివేదికలే తేల్చేస్తున్నాయి. కంపెనీలు భారీగా విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థ వెనుకపట్టు ఎందుకు పడుతున్నదని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కార్పొరేట్‌ కంపెనీలను ప్రసన్నం చేసుకొనేందుకే ఇంత భారీగా పన్ను రాయితీలు ఇస్తున్నది తప్ప, దానివల్ల దేశానికి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదని విమర్శిస్తున్నారు.
కార్పొరేట్ల లబ్ధికే… 51 శాతం మంది అభిప్రాయం ఇదే
రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక విధానాలు బడా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ ఆగస్టు ఎడిషన్‌ సర్వేలో వెల్లడయింది. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోనే నడుపుతున్నదని విశ్వసించే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. 2021 జనవరిలో నిర్వహించిన సర్వేలో… మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ బాగున్నదని 67 శాతం మంది పేర్కొనగా, తాజాగా ఇది 48 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదని 29 శాతం మంది (2021 జనవరిలో ఇది 10 శాతమే) పేర్కొన్నారు. మరో 20 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండగా… మోదీ సర్కారు తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటం గమనార్హం. ఇదిలాఉండగా, స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌లో భాగమేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు, చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా సమస్యలపైనే ప్రసంగంలో ఆయన ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్టు తెలుస్తున్నది. 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఎర్రకోటపై ఒకసారి, నవంబర్‌లో కొత్త పార్లమెంట్‌ భవనంలో మరోసారి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఇంకోసారి మోదీ ప్రసంగించనున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img