Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

పోరుబాటకు అనూహ్య స్పందన

. మూడో రోజుకి చేరిన సంతకాల ఉద్యమం
. జగనన్న కాలనీలు, టిడ్కో లబ్ధిదారులకు సీపీఐ నేతల భరోసా
. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదని స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర సమస్యలు, టిడ్కో ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై లబ్ధిదారుల నుంచి సీపీఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం గురువారం మూడో రోజుకి చేరుకుంది. సీపీఐ నేతలు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలను సందర్శిస్తూ లబ్ధిదారుల నుంచి సమస్యలు తెల్సుకుంటున్నారు. టిడ్కో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తీరును పరిశీలిస్తున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం, చిన్నశెట్టిపల్లె జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సీపీఐ బృందం పరిశీలించింది. సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ జగనన్న కాలనీలలో నీళ్లు, రోడ్లు, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలు కల్పించకుండా ఇళ్లు కట్టుకోవాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఎన్నికల ముందు పేదలందరికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చాక కేవలం ఒక సెంటు స్థలం ఊరికి దూరంగా ఇచ్చి, ఇల్లు కట్టకుండానే విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కాలనీలు ఊరికి దూరంగా ఉండడంతో పేదలు ఎంతో వ్యయప్రయాసలకు లోనుకావల్సి వస్తున్నదన్నారు. నీళ్లు, రోడ్డు, విద్యుత్‌ వంటి కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు 2సెంట్ల స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి రుణం మంజూరు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరైన లబ్ధిదారుల నుంచి రూ.35వసూలు చేసి పునాదులు మొదలుపెట్టడం దారుణమన్నారు. ఇళ్లు ప్రారంభించి ఏడాది దాటినా ఇంకా అనేక ఇళ్లు పునాదుల వద్దే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జగనన్న కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పి.సుబ్బరాయుడు, సహాయకార్యదర్శి షరీఫ్‌, పట్టణసమితి సభ్యులు డి.శివారెడ్డి, వై.హరి, ప్రమీళ, సురేష్‌, ప్రతాప్‌, సుజాత, రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి, కె.ఈశ్వరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img