అగ్రిగోల్డ్ బాధితులకు 24న రూ.20వేల లోపు పంపిణీ
10న నేతన్న నేస్తం అమలు
నూతన విద్యావిధానం సంస్కరణలకు ఆమోదం
భావనపాడు, బందరు పోర్టుల డీపీఆర్‌లకు గ్రీన్‌సిగ్నల్
300చ.గ వరకు అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ
మానవహక్కుల సంఘం, లోకాయుక్త కర్నూలుకి తరలింపు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10లక్షల ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితుల సహకారం మరువలేనిదని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే, కొత్తగా పది లక్షలు అందజేయనుంది. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.550 కోట్ల అదనపు భారం పడనున్నది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం వివిధ అంశాలపై చర్చించిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడిరచారు. విద్యారంగంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానం సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్ స్కూళ్లు, మున్సిపల్, గిరిజన సంక్షేమ స్కూళ్లను సంస్కరణల్లో భాగంగా ఆరు రకాలుగా వర్గీకరిస్తారు. 2021-22 సంవత్సరానికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఈనెల 10న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకం కింద సొంత మగ్గంపై నేసే కార్మికుడి కుటుంబానికి రూ.24వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 20వేల లోపు డిపాజిట్లను ఆగస్టు 24న అందచేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఆగస్టు 5వరకూ అందిన వివరాల ప్రకారం నాలుగు లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ.511 కోట్లు చెల్లించనున్నారు. రూ.10వేల లోపు డిపాజిట్‌దారులైన 3.4 లక్షలమందికి ఇదివరకే రూ.238.7 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక కేబినెట్ ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు ఇవే.
అ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్దేశించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమానికి ఆమోదం, జగనన్న స్వచ్చ Ûసంకల్పం కింద అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు.
అ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, మొత్తం 1566.442 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటవుతున్న ఈ అథారిటీలో మొత్తం 207 గ్రామాలు, 17 మండలాలు, 3 యూఎల్‌బీలు ఉంటాయి.
అ దీంతోపాటు కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కూడా)గా మార్పు. దీనిలో 172 గ్రామాలు, 15 మండలాలు, 5 యూఎల్‌బీలు. మొత్తం 1236.42 చదరపు కిలోమీటర్ల పరిధి.
అ అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని అక్రమణల క్రమబద్ధీకరణ. 300 చదరపు గజాల వరకూ రెగ్యులరైజేషన్. అక్టోబరు 15, 2019 నాటివరకూ ఉన్న వాటికి వర్తింపు.
అ 1977 నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం (పీఓటీ)కు సవరణ. అసైన్డ్ భూమి లేదా అసైన్డ్ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువును 20 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గింపు.
అ రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం పోర్టు
నిర్మాణం కోసం ఉద్దేశించిన రివైజ్డ్ డీపీఆర్‌కు, రూ..4361.09కోట్లతో నిర్మించే భావనపాడు పోర్డు రివైజ్డ్ డీపీఆర్‌కు ఆమోదం
– ఏపీజీడీసీలో ప్రభుత్వ సంస్థలైన ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు 50శాతం నుంచి 74శాతానికి పెంపు.
– శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖజిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్పల్లో రూ.1720.61 కోట్లతో షిఫింగ్ హార్బర్ల నిర్మాణానికి నిర్ణయం.
– ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్, హిందూ రిలిజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్ యాక్ట్, 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌జారీకి మంత్రివర్గం ఆమోదం.
– హైకోర్టు సూచనల మేరకు హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కార్యాలయాలు కర్నూలుకి తరలింపు
– గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం
– పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్ టెక్నిషియన్, 8 ల్యాబ్ అటెండెట్ల పోస్టులకు, ఆర్బీకేల్లో విత్తన ఉత్పత్తి పాలసీకి ఆమోదం
– ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.