Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

పోలవరం పాలకుల నిర్లక్ష్యం

నిధులు ఇవ్వడంలో కేంద్రం జాప్యం
ప్రాజెక్టు నిర్మించే వరకువిశ్రమించం: రామకృష్ణ
ప్రాజెక్టు పనులు పరిశీలించిన సీపీఐ బృందం

విశాలాంధ్ర బ్యూరో` ఏలూరు: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సోమవారం రామకృష్ణ అధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించింది. స్పిల్‌ వే, ఎగువ, దిగువ, కాపర్‌ డ్యాం పనులను స్వయంగా పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆదిరెడ్డి ప్రాజెక్టు పనులను మ్యాప్‌, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. పోలవరం పూర్తి అయితే 7 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు, పట్టణాలకు తాగునీరు, ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీరు లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిం దన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని రామకృష్ణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం హైదరాబాదులో ఉందని, ఈ కార్యాలయాన్ని రాజమండ్రికి మారుస్తామని హామీ ఇచ్చారని, కానీ నేటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై రూ.2900 కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులు ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ చుట్టూ తిరుగుతున్నా మోదీ స్పందించడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరు చెప్పడం లేదన్నారు. కాపర్‌ డ్యాం నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, డయాఫ్రం వాల్‌లో నష్టం ఎంతో తెలియదన్నారు. మోసపూరిత మాటలు వల్లె వేయ కుండా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నిజం తెలిపినం దుకు అభినందిస్తున్నానన్నారు. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించి… ప్రాజెక్టు అథారిటీ సిఫారసు చేసినప్పటికీ పోలవరం పూర్తి చేయడానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ ఇప్పటి వరకూ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అనేక రాయితీలు ప్రకటిస్తున్న పాలకులు ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కించడం సరికాదన్నారు. త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేస్తారా అని మోదీ, జగన్‌ను ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాలు పూర్తికాక వ్యవసాయ రంగం కుదేలై రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పాలకుల విధానాలే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల కేటాయింపులు, నిర్వాసితులకు పరిహారం తదితర విషయాలకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సీఎం జగన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తి అయిన తరువాత విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కేంద్రమంత్రి షెకావత్‌ను కలుస్తామని రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. బిజెపి రాష్ట్ర నేతలకు సిగ్గు ఉంటే పోలవరం నిధులపై ఉద్యమించాలని, రూ.2900 కోట్ల నిధులు మంజూరు చేయించాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ నాయకులు చరిత్రహీనులుగా మిగులుతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. నిర్వాసితుల సమస్యలపై దిల్లీలోనే తాడోపేడో తేలుస్తామన్నారు. సీపీఐ బృందంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య , డి.జగదీశ్‌, కేవీవీ ప్రసాద్‌, డేగా ప్రభాకర్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కామేశ్వరరావు, కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, ఎ.విమల, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు, ఎండీ మునీర్‌, బి కొండల రావు, జమలయ్య, కుండ్రపు రాంబాబు , వి.కొండలరావు, మండల కార్యదర్శి జేవీ నరసింహారావు, ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల వెంకటేశ్వరరావు, జమ్మి శ్రీనివాసరావు, కారం దారయ్య, బాడిస రాము, మైసాక్షి వెంకటాచారి, ఏలూరు సమితి సభ్యులు జేవీ రమణ రాజు, ఐతా సురేశ్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img