Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

‘పోలవరం’ వేగవంతం

. నిర్వాసితులకు మెరుగైన పునరావాసం
. పర్యాటక కేంద్రంగా చేస్తాం
. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ పనులను డిసెంబరు నాటికి పూర్తి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడిరచారు. మంగళవారం ఆయన మంత్రులు, అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. సీఎం జగన్‌ తొలుత ఎగువ కాపర్‌ డ్యామ్‌ను పరిశీలించారు. ఆపై పనుల పురోగతిని ఫోటో ఎగ్జిబిషన్‌ ద్వారా ముఖ్యమంత్రి కి అధికారులు వివరించారు. అనంతరం దిగువ కాపర్‌ డ్యాం వద్ద పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… గైడ్‌ వాల్‌ డిజైన్లు కేంద్ర జల సంఘం, సీడబ్ల్యూసీ ఖరారు చేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని, గైడ్‌వాల్‌ లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూడటం సరికాదన్నారు. సీడబ్ల్యూసీ పరిశీలన పూర్తి కాగానే తక్షణం మరమ్మతులు చేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాలలో వచ్చే చిన్న చిన్న సమస్యలను గమనిస్తూ సమీక్షించుకొని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాపర్‌ డ్యామ్‌లో ఖాళీలను వదిలేసిన కారణంగా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ దారుణంగా దెబ్బతిందన్నారు. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం అవడంతో పాటు రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. కానీ పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా ఉండటం దురదృష్టకరం అన్నారు. రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేసిన విషయం మాత్రం ఎల్లో మీడియాకు కనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రామోజీరావు బంధువులకు నామినేషన్‌ పద్ధతుల్లో పనులు అప్పగించారన్నారు. ప్రస్తుతం స్పిల్‌ వే కాంక్రీట్‌ పూర్తయిందని, 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ పూర్తయిందని, గ్యాప్‌ బీ3 వద్ద కాంక్రీట్‌ డ్యామ్‌ పూర్తయిందన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌ బి2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100 శాతం ఇసుక రవాణా పూర్తయిందన్నారు.
నిర్వాసితుల పునరావాసంపై సమీక్ష
పునరావాస కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల్లో 12658 కుటుంబాలను తరలించామని అధికారులు తెలపగా షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, పర్యాటకులు ఉండేందుకు సకల సదుపాయాలతో హోటళ్లు నిర్మించడానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ కోటగిరి శ్రీధర్‌, స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ సీ నారాయణ రెడ్డి, బీ సుధాకర్‌ బాబు, మెగా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img