Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పోలవరానికి మంగళం పాడినట్లేనా?

. నిర్వాసితులపట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలి
. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం మంగళం పాడినట్లేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిరచారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 41.5 కాంటూరుకే డబ్బులిస్తామనడంతో పోలవరం పూర్తి ప్రయోజనాలు నెరవేరబోవని, జగన్‌ అధికారం చేపట్టాక పోలవరం నిర్మాణాన్ని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టరును మార్చి గందరగోళానికి తెరలేపారని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గించే కుట్రకు ఊతమిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేట్లుగా నిర్మాణం జరిగితేనే ప్రయోజనముంటుందిగానీ ఎత్తు తగ్గిస్తే ఉపయోగం ఉండదని సూచించారు. పోలవరం ప్రాజెక్టును 2021జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి, 2022 ఖరీఫ్‌ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తామని మరోసారి, ఇప్పుడు 2023 ఖరీఫ్‌ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, నిర్వాసితుల పరిహారం కోసం నిధులు రాబట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షల చొప్పున పరిహారం, పునరావాసం కల్పిస్తామని జగన్‌ తాను ఇచ్చిన మాటను ఇప్పుడు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏటా గోదావరి నదికి సంభవిస్తున్న వరదల వల్ల పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వరదలు వచ్చినప్పుడు హడావుడిగా పునరావాస కేంద్రాలకు తరలించడం తప్ప, నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి, పునరావాసం కల్పించక పోవడం దుర్మార్గమని, నిర్వాసితులపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. ఒకవైపు అమరావతి రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేశారని, మరోవైపు పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేశారని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనని, పోలవరం, అమరావతి నిర్మాణాలపై వైసీపీ వైఖరిని ప్రజలు క్షమించబోరన్నారు. ఇప్పటికైనా పోలవరం అసలు ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం తదితర సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వాయిదాలు వేయడం తగదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img