Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

పోలీస్‌ గుప్పిట కోనసీమ

సడలని ఉద్రిక్తత బ అల్లర్ల సూత్రధారి అరెస్టు?
రావులపాలెంలో ర్యాలీకి ఆందోళనకారుల యత్నం
నిలువరించిన పోలీసులు
ఎస్పీ వాహనంపై రాళ్లు

విశాలాంద్ర`రావులపాలెం/అమలాపురం: కోనసీమలో జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలని కోరుతూ కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోనసీమ జిల్లా సాధన సమితి సభ్యులు ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మళ్లీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అమలాపురం ఘటన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే నియంత్రించారు. ఎవరు కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు పట్టణంలో బందోబస్తు చేపట్టారు. అయితే కోనసీమ సాధన సమితి సభ్యులు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని నిలువరించారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బందోబస్తులో భాగంగా పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎస్పీ కారులో వెళ్తుండగా రావులపాలెం రింగ్‌ సెంటర్‌ వద్ద కొంత మంది యువకులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైప పోలీసులు యువకులను వెంబడిరచడంతో వారు పారిపోయారు. ఈ ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల యువకులు దాగి ఉండొచ్చని, ఆందోళనకు దిగొచ్చని భావించి పకడ్బందీగా భద్రతా చర్యల చేపట్టారు. రావులపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. గోపాలపురంలో ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బలగాలను మోహరించారు. బందోబస్తు నిమిత్తం ఇక్కడకు వచ్చిన కాకినాడ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ రావులపాలెంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఐదుగురు మించి గుమిగూడవద్దని స్పష్టం చేశారు. ర్యాలీలు చేసే ఆలోచనలు మానుకోవాలని కోరారు. ప్రయాణీకుల అవస్థలు… ఆర్టీసీ బస్సులను చాలా వరకు తగ్గించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో స్థానిక అమలాపురం రోడ్డు, జాతీయ రహదారిపై ప్రైవేటు వాహనాల కోసం మండుటెండలో అల్లాడుతూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అలాగే కళా వెంకట్రావు సెంటర్‌, అమలాపురం రోడ్డు, మార్కెట్‌ రోడ్లలో కొన్ని దుకాణాలను, కొన్ని పెట్రోల్‌ బంకులను కూడా మూయించి వేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వివిధ పనుల నిమిత్తం రావులపాలెం వచ్చిన వారిని సైతం పోలీసులు అడ్డుకోవడంతో పాటు, కొంతమంది నుంచి మోటార్‌ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
అమలాపురంలో అడుగడుగునా నిఘా
హింసాత్మక ఘటన నేపథ్యంలో అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మళ్లీ ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. ఏయే మార్గాల నుంచి నిరసనకారులు వచ్చే అవకాశం ఉందో.. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అమలాపురంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అమలాపురంలో కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమలో సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలులో ఉంటాయని, ర్యాలీలు.. నిరసనలు.. బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా మంగళవారం చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రదారిగా భావిస్తోన్న అన్యం సాయి అనే వ్యక్తిని అమలాపురం పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అన్యం సాయి, ఈనెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో పాల్గొన్నారు. అమలాపురం కలెక్టరేట్‌ వద్ద ఒంటిపై సాయి పెట్రోల్‌ పోసుకుని నిరసన తెలిపాడు. అతనిపై గతంలోనే పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. తాజాగా అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అల్లర్లలో అన్యం సాయి పాత్రపై విచారిస్తున్నారు.
దాడులు ఆపడంలో పోలీసులు విఫలం
అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులను నిలువరించడంలో పోలీసులు విఫలం అయ్యారని అంబేద్కతర్‌ జిల్లా సాధన సమితి నాయకులు విమర్శించారు. మంటల్లో కాలిన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ పరిశీలించే సమయంలో అక్కడికు వచ్చిన అంబేద్కర్‌ జిల్లా సాధన సమితి నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం నాటి ఘటనలో దహనమైన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ పరిశీలించారు. ర్యాలీకి పిలుపునిచ్చిన కోనసీమ సాధన సమితి ఇందుకు బాధ్యత తీసుకోవాలని విశ్వరూప్‌ అన్నారు. కొంతమంది సంఘ విద్రోహశక్తులు ర్యాలీలోకి చొరబడ్డారని, అమలాపురం ప్రజలకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవన్నారు. ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీషీటర్లు చొరబడ్డారని ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారన్నారు. అయితే ఈ ఘటనలో వైసీపీతో పాటు ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. అమలాపురం ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. అంబేద్కర్‌ పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరాయని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img