Monday, June 5, 2023
Monday, June 5, 2023

పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన

. ఒకేసారి 39 మంది ఐపీఎస్‌ల బదిలీలు
. 12 జిల్లాల ఎస్పీలకు స్థానచలనం
. అర్థరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ
. 62కి చేరిన ఐఏఎస్‌ల బదిలీల సంఖ్య

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, 24 గంటల వ్యవధిలోనే మరో ఆరుగురు ఐఏఎస్‌లతో పాటు 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఐపీఎస్‌ల బదిలీ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. అందరూ ఊహిస్తున్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో భారీస్థాయిలో వరుసగా జరుగుతున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ బదిలీలను గమనిస్తే ఇవన్నీ ఎన్నికల టీమ్‌లుగానే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా పని చేస్తున్న జీవీజీ అశోక్‌ కుమార్‌ను ఏలూరు డీఐజీగా బదిలీ చేశారు. ఏలూరు డీఐజీగా పని చేస్తున్న జి.పాలరాజును గుంటూరు ఐజీ, దిశ ఐజీగా బదిలీ చేశారు. శాంతిభద్రతల ఏఐజీగా పని చేస్తున్న ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని అనంతపురం డీఐజీగా పంపారు. అనంతపురం డీఐజీగా పని చేస్తున్న ఎం.రవిప్రకాశ్‌ను సెబ్‌ డీఐజీగా స్థానచలనం కల్పించారు. దిశ డీఐజీ బి.రాజకుమారిని ఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీఐజీగా నియమించారు. ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న కోయ ప్రవీణ్‌ను గ్రే హౌండ్స్‌ డీఐజీగా బదిలీ చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా విధులు నిర్వహిస్తున్న శంఖబత్ర బాగ్చీని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా బదిలీ చేశారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బదిలీ చేశారు. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీపీ అతుల్‌ సింగ్‌ను పోలీసు నియామక మండలి చైర్మన్‌, అదనపు డీజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీసు నియామక మండలి చైర్మన్‌గా ఉన్న మనీష్‌ కుమార్‌ సిన్హా ప్రస్తుతం సెలవులపై వెళ్లగా ఆయన స్థానంలో అతుల్‌ సింగ్‌ను బదిలీ చేశారు. విశాఖపట్నం కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌ శ్రీకాంత్‌ను సీఐడీ ఐజీగా బదిలీ చేశారు. గుంటూరు ఐజీ సీఎం త్రివిక్రమ వర్మను విశాఖపట్నం కమిషనర్‌గా, విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఉన్న విక్రాంత్‌ పాటిల్‌ను పార్వతీపురం మన్యం ఎస్పీగా బదిలీ చేశారు. పార్వతీపురం మన్యం ఎస్పీ వాసన్‌ విద్యాసాగర్‌ నాయుడును విశాఖపట్నం శాంతిభద్రతల డీసీపీగా, విశాఖపట్నం శాంతిభద్రతలు డీసీపీగా ఉన్న గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను ఎస్‌బీఐ ఎస్పీగా, పాడేరు అదనపు ఎస్పీ తుహిన్‌ సిన్హాను అల్లూరి సీతారామరాజు ఎస్పీగా, అల్లూరి సీతారామరాజు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌ను కాకినాడ ఎస్పీగా బదిలీ చేశారు. కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనకాపల్లి ఎస్పీ గౌతమి శాలిను విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ చేశారు. డా.అంబేద్కర్‌ కోనసీమ ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డిని తూర్పుగోదావరి ఎస్పీగా పంపించారు. విజయవాడ శాంతిభద్రతల డీసీపీ డి.మేరి ప్రశాంతిని ఏలూరు ఎస్పీగా బదిలీ చేశారు. ఏలూరు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మను విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా స్థానచలనం కల్పించారు. నెల్లూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావును కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా, ఏసీబీ ఎస్పీ ఆర్‌.గంగాధర్‌ రావును అన్నమయ్య జిల్లా ఎస్పీగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజును సీఐడీ ఎస్పీగా, అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను సీఐడీ ఎస్పీగా, సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ను విజయవాడ రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు. కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను ఆక్టోపస్‌ ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తున్న ఆరుగురు ఐపీఎస్‌లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డిని సత్యసాయి జిల్లా ఎస్పీగా, కె.శ్రీనివాసరావును అనంతపురం ఎస్పీగా, తిరుమలేశ్వర్‌ రెడ్డిని నెల్లూరు ఎస్పీగా, పి.శ్రీధర్‌ను డా.అంబేద్కర్‌ కోనసీమ ఎస్పీగా, కె.వి.మురళీకృష్ణను అనకాపల్లి ఎస్పీగా, సర్వశేష్ఠ్ర త్రిపాఠిని పరిపాలన, పోలీసు ప్రధాన కార్యాలయం డీఐజీగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మరో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.విజయానంద్‌కు ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. సర్వశిక్ష అభియాన్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎస్‌.సురేష్‌కుమార్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో బి.శ్రీనివాసరావును నియమించింది. ఐఏఎస్‌ అధికారి వెట్రిసెల్విని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపేసింది. ప్రసవ సెలవుపై వెళ్లిన నారపురెడ్డి మౌర్యను కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ హరితను తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో వికాస్‌ మర్మత్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ (విజిలెన్స్‌)గా వ్యవహరిస్తున్న చామకూరి శ్రీధర్‌ను నియమించింది. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను ప్రకాశం జిల్లా జేసీగా నియమించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img