Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పోలీస్‌ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు

. దిశ యాప్‌తో కోటిపైగా డౌన్‌లోడ్స్‌
. పర్యాటకుల సౌకర్యం, భద్రతకు ప్రత్యేక స్టేషన్లు
. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో 20 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు
. ప్రారంభించిన సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : పోలీస్‌ శాఖలో గతంలో ఎన్నడూలేని విధంగా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, ఎప్పుడూ జరగని విధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ని… మొట్టమొదటగా రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవర్తించే విధానంలో గతానికి ఇప్పటికీ గణనీయమైన తేడా కనిపించే విధంగా పోలీసులు మీ స్నేహితులు అనే భావనను కలిగిస్తూ… అన్ని పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టును ఏర్పాటు చేసి ఫిర్యాదుదారులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను వర్చువల్‌గా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్‌ చరిత్ర సృష్టిస్తోందని, ఇప్పటివరకు దాదాపు 1 కోటి 20 లక్షల పై చిలుకు రిజిస్ట్రేషన్లు, డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు షేక్‌ చేసినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా చాలు… ఐదు, పదినిమిషాలలోపే పోలీసు సోదరుడు ఒక అన్నగా, తమ్ముడిగా వచ్చి సహాయం చేయడానికి స్పందిస్తున్నారని, ఇలా ఇప్పటివరకు దాదాపు 6 వేల మందికి సహాయం లభించిందని సీఎం వివరించారు. ఇటువంటి మార్పుల్లో భాగంగానే ఇవాళ 20 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో టూరిస్ట్‌ల భద్రత కోసం పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. టూరిస్ట్‌ల భద్రతే లక్ష్యంగా మొత్తం 20 ప్రాంతాలను గుర్తించి అక్కడ కియోస్క్‌లు ఏర్పాటు చేశాం. ఆ కియోస్క్‌లన్నీ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానమై, 20 అదనపు పోలీస్‌ స్టేషన్‌లుగా పని చేస్తాయి. ప్రతి కియోస్క్‌లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది రెండు షిప్టులలో పనిచేసే విధంగా రూపకల్పన చేశారు. వీరిని ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా టెలిఫోన్‌ నంబరు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ ప్రదేశంలో ఎవరికైనా ఆపద వస్తే… దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే పోలీసు సోదరుడు మీకు తోడుగా నిలబడినట్టే అన్న భావన కల్పించే విధంగా కరపత్రాలు కూడా ఆ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. వీరందరికీ ప్రత్యేకమైన టెలిఫోన్‌ నంబరు, రేడియో సెట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, అత్యవసర టెలిఫోన్‌ నంబర్లు, వాహనాలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు, యాత్రికులు నిర్భయంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిలో సగం మంది మహిళలు ఉన్నారు. దీనివల్ల ఎవరైనా మహిళలు ఆ కియోస్క్‌లకు వెళ్లినప్పుడు వారికి మహిళా సిబ్బంది తోడుగా నిలబడతారు. ఈ పోలీస్‌ స్టేషన్లో పని చేసే వారు అంకిత భావంతో, సేవా భావంతో పని చేయడం ద్వారా, పోలీస్‌ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img