Monday, June 5, 2023
Monday, June 5, 2023

ప్రజలపై మరో పిడుగు

భారీగా ఔషధ ధరల పెంపు


రేపటి నుంచి అమలు
పేదలపై మోదీ సర్కారు మరింత భారం

న్యూదిల్లీ : అన్ని రకాల నిత్యావసర వస్తువులు, శిలాజ ఇంధనాల ధరలు పెంచిన మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో పిడుగువేసింది. పెరిగిన ఆహార వస్తువుల ధరలు, తరిగిన ఆదాయం, నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య జనం ఇకపై మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పేద రోగుల నెత్తిన కేంద్రం మరో భారం మోపనుంది. ఇప్పుడున్న ధరలకు తోడు అత్యవసర ఔషధాల ధరలు ఏకంగా 12.12 శాతం పెరగనున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుండి 10.76 శాతం పెరిగిన ధరలకు తోడు ఈ పన్నెండు నెలల్లో ఔషధాల ధరలు ఏకంగా 24.18 శాతం పెరిగాయి. ఇది ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు తోడు నిత్యావసరాలైన ఔషధాల ధరలు, ఆహారవస్తువుల ధరల పెరుగుదలతో పేదల బతుకులు మరింత దుర్భరస్థితికి దిగజారే ప్రమాదం ఏర్పడిరది. ఔషధాల ధరలలో పెంపుదలను జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల సంస్థ(ఎన్‌పీపీఏ) అనుమతించడంతో కోట్లాదిమంది పేద రోగులపై మరింతభారం పడనుంది. ఔషధాల ధరలను 2017లో 1.97 శాతం, 2018లో 3.43 శాతం, 2019లో 4.26 శాతం, 2020లో 1.88 శాతం మాత్రమే పెంచేందుకు అనుమతివ్వగా ఇప్పుడు మాత్రం భారీగా పెంచడానికి సిద్ధమైంది. 2021లో 10 శాతంపైగా పెరిగాయి. అత్యవసర ఔషధాల ధరలను 10 శాతానికి మించి పెంచడం వరుసగా ఇది మూడో సంవత్సరం. 2022 ఏప్రిల్‌ 1 నుండి ఔషధాల ధరల పెరుగుదల 36.60 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. మరోపక్క మందుల తయారీ కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తున్నాయి.
పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, గుండె సంబంధిత మందులు, యాంటీ బయోటిక్స్‌ వంటి మందుల ధరలు పెరగనున్నాయి. 384 మాలిక్యూల్స్‌ ధరలను పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ లిస్టెడ్‌ మందుల జాబితాలో జ్వరం, ఇన్ఫెక్షన్‌, గుండె జబ్బులు, రక్తపోటు, చర్మ వ్యాధులు, రక్తహీనత వంటి వాటి చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. జాతీయ ధరల నియంత్రణ యంత్రాంగం పరిధికి వెలుపల ఉన్న నాన్‌-షెడ్యూల్డ్‌ ఔషధాలకు ప్రతి సంవత్సరం 10 శాతం వార్షిక పెరుగుదలకు అనుమతిస్తారు. ఈ మందులు ఇప్పటికే పేదలకు అందుబాటులోలేవు. ఎందుకంటే వాటి ధర చాలా ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలకు కొనుగోలు చేసే స్థోమతలేదు. ధరలు పెంచేందుకు అనుమతించాలన్న ఎన్‌పీపీఏ నిర్ణయాన్ని ఔషధ తయారీ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డ్రగ్స్‌ తయారీలో ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో తక్షణమే ధరలను 10 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అన్ని ముడి పదార్థాలు, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ పదార్థాలు, ప్లాస్టిక్‌, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ ధరలు, సరుకు రవాణా ఖర్చులు, ఉత్పత్తితోపాటు సరఫరా ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని సూచిస్తున్నాయి.
ఔషధాల ధరలను ఎన్‌పీపీఏ ఏటా నిర్ణయిస్తుంది. ధరల పెంపునకు అనుమతిస్తే మార్కెట్‌లో మందుల కొరత ఉండదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పేద రోగులను రక్షించేందుకు కేంద్రం నిర్దిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. పేద రోగులకు అవసరమైన మందులను ఉచితంగా లేదా సరసమైన ధరలకు ప్రభుత్వం సరఫరా చేయాలి. మార్కెట్‌లో నకిలీ, నాసిరకం మందుల నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నకిలీమందుల తయారీపై 18 ఔషధ కంపెనీల లైసెన్సులను రద్దుచేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో 76 కంపెనీలపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీజీసీిఐ) తనిఖీచేసి ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 70, ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లో 23 కంపెనీలు నకిలీ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించి, వాటిపై తగిన చర్యలు చేపట్టింది. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి చర్యలపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
నకిలీ, నాసిరకం మందుల ఉత్పత్తిని తక్షణమే ఆపడానికి షోకాజ్‌ నోటీసు వంటి చర్యలు సరిపోవు. స్పెసిఫికేషన్‌లు, ఔషధాల పరిమాణాన్ని తారుమారు చేయడం సహా అనేక మార్గాల ద్వారా అధిక లాభాలతో ఔషధాలు విక్రయించడం, ఔషధ తయారీదారుల దురాశకు కేంద్రం కళ్లెం వేయాలి. అన్ని మందులు, వైద్య పరికరాలపై 10 శాతం నుంచి 800 శాతం లాభ మార్జిన్‌ వేసుకుంటున్న అన్యాయమైన ధరల నుండి ప్రజలను రక్షించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ధరల నియంత్రణ విధానాన్ని తీసుకురావడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img