Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రజల మనిషి ధర్మభిక్షం

శతజయంతి ముగింపు సభలో వక్తలు
తాగు, సాగునీటి కోసం పరితపించారు : సురవరం
ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు : మంత్రి శ్రీనివాస్‌

విశాలాంధ్ర`హైదరాబాద్‌:
ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించిన, పోరాడిన బొమ్మగాని ధర్మభిక్షం గొప్ప కమ్యూనిస్టు, ప్రజల మనిషి అని వక్తలు నివాళి అర్పించారు. ధర్మభిక్షం శతజయంతి ముగింపు సభ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మంగళవారం జరిగింది. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు, సీపీిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన ధర్మభిక్షం అభిమానులతో రవీంద్ర భారతి కిక్కిరిసింది. సభకు అతిధిగా హాజరైన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ, ధర్మభిక్షం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సాగునీటి కోసం ధర్మభిక్షం పరితపించేవారని తెలిపారు. విద్యార్థులు, యువకులకు ఆయన సమయాన్ని కేటాయించేవారని, ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారని సురవరం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వంలో ఉన్నారని, అనేక చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో లేనివారు అధికారంలోనికి వచ్చి, మతం పేరుతో దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీిని ఉద్దేశించి విమర్శించారు. రాజకీయాలు, మతాలు వేర్వేరుగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకానికి బొమ్మగాని ధర్మభిక్షం నామకరణం చేస్తామని రాష్ట్ర ఆబ్కారి, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ ప్రకటించారు. ధర్మభిక్షం ఒక గీత వృత్తికే పరిమితం కాదని, అనేక వృత్తులు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారని కొనియాడారు. ధర్మభిక్షం ఆశయాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘నీరా పాలసీ’ తీసుకొచ్చిందని తెలిపారు. గీత కార్మికులకు మోపెడ్‌ అందజేస్తామన్నారు. జ్యోతిభా పూలే తరహా తెలంగాణలో ధర్మభిక్షం తొలిసారి ఇంగ్లీష్‌ విద్యను, హాస్టల్‌ విధానాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు.ధర్మభిక్షం జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విషయాన్ని విద్యా శాఖ ఏర్పాటు చేసిన ఉపసంఘానికి లేఖ రాస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌ చెప్పారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్‌ మాట్లాడుతూ, ప్రజానాయకులు ఎన్ని సిద్ధాంతాలు, మాటలు చెప్పినా, జీవితంలో ఎక్కడో ఒక దగ్గర రాజీపడుతుంటారని, కాని ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచించకుండా నిజమైన కమ్యూనిస్టుగా జీవించిన అతి కొద్ది నాయకుల్లో ధర్మభిక్షం ఒకరని అన్నారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ ధర్మభిక్షం అలుపెరగని యోధుడన్నారు. బాల్యం నుంచి కూడా ధర్మభిక్షం ప్రజా సంక్షేమానికి ఆలోచన చేశారని, వారి కోసమే కృషి చేశారని, అందుకే ఆయనను ప్రజల మనిషి అని అంటారన్నారు. తన జీవితాంతం ప్రజా సమస్యలపై స్పందించేవారని గుర్తు చేశారు.
నిజమైన సమతావాది : నారాయణ :
సీపీిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ ధర్మభిక్షం నిజమైన సమతావాది అని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో స్వాముల చుట్టూ ఆసాములు చేరారని ఎద్దేవా చేశారు. రామానుజ స్వామి విగ్రహం ప్రతిష్టను కూడా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ తాను కమ్యూనిస్టు పార్టీలోకి రావడానికి ధర్మభిక్షమే కారణమని గుర్తుచేసుకున్నారు. ఆయన ఎంపిగా గెలిచినా అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారని, ఎంపిగా ఆటోలో తిరిగేవారన్నారు. టీపీసీసీి రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ ధర్మభిక్షంను యువత ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలన్నారు.
సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ బ్యాలం నుంచి చనిపోయే వరకు ధర్మభిక్షం నిరంతర ప్రజాల పక్షాన పోరాటం చేశార న్నారు. ఎంపిగా ఉన్నప్పుడు ధర్మభిక్షం, అలాగే రావి నారాయణ రెడ్డి అనేక సందర్భాల్లో రాసిన లేఖలను తాను ఇప్పటికీ భద్రపర్చుకున్నానన్నారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడమే ధర్మభిక్షంకు నిజమైన నివాళి అని, వామపక్షాలు ఐక్యమత్యంగా పనిచేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన కర్తవ్యం ఉన్నదన్నారు. ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిర్మాణ దశలో నాటి నిర్మాణ కార్మికులు, నాగార్జున సాగర్‌ నిర్మాణ పనులు చేపట్టిన కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటానికి ధర్మభిక్షం నాయకత్వం వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, తెలంగాణ రాష్ట్ర బీసీి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషనర్‌ ఛైర్మన్‌ జి.రాజేషం గౌడ మాట్లాడూతూ చివరి శ్వాస వరకు ప్రజాసమస్యల పరిష్కారానికే ధర్మభిక్షం పోరాడారన్నారు. ధర్మభిక్షం పేరుతో ప్రతిఏటా అవార్డులు ఇవ్వాలన్నారు.
కరోనా ఉధృతిలో గత ఏడాది ప్రారంభమైనప్పటికీ ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని బొమ్మగాని ప్రభాకర్‌ తెలిపారు. పలు చోట్ల సెమినార్లు, పోటీలు నిర్వహించారని తెలిపారు. వేదికపైన సీపీిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరులు ఆశీనులయ్యారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం: అలనాటి తెలంగాణ సాయుధపోరాటంలో ధర్మభిక్షం సహచరులుగా ఉన్న గుంటకండ్ల పిచ్చిరెడ్డి, దొడ్డా నారాయణ, తోడేటి కొమురయ్య, కందిమళ్ల ప్రతాపరెడ్డిలను డి.రాజా శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్‌ సంయుక్తంగా రచించిన బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్ర ‘‘ప్రజల మనిషి’’ పుస్తకాన్ని బోయినిపల్లి వినోద్‌ ఆవిష్కరించారు. ధర్మభిక్షం జీవితంపై ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌ రచించిన పాటల సీడీని మంత్రి వి.శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. బొమ్మగాని నాగభూషణం రచించిన ‘‘ఉద్యమ సంతకం’’ కవితా సంపుటిని సురవరం సుధాకర్‌ విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img