Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ప్రజాందోళనలపై ఉక్కుపాదం

. తొక్కిసలాట సాకుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు
. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు… ర్యాలీలు
. రోడ్డు మార్జిన్లకు నిబంధనల వర్తింపు
. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాల ఎంపిక
. అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి
. రాష్ట్ర హోంశాఖ వివాదాస్పద ఉత్తర్వులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో రోడ్‌ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో వరుసగా జరిగిన తొక్కిసలాట ఘటనల సాకుతో ప్రజా వ్యతిరేకతను, ఆందోళనలను అణచివేసేందుకు, ప్రతిపక్షాల పీక నొక్కేందుకు ఇదే అదనుగా రాష్ట్ర హోంశాఖ అత్యంత వివాదాస్పద మార్గదర్శకాలు జారీచేసింది. దీనిప్రకారం ఇకపై మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్‌ నిబంధనలు అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోంశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. రోడ్డుకు దూరంగా, ప్రజలకు ఇబ్బందిలేకుండా సభలు, రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే షరతులతో కూడిన అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను పూర్తిగా నిషేధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ రహదారులపైన, మార్జిన్లలోనూ సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. బ్రిటీషుకాలం నాటి 1861 పోలీస్‌ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసం మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు తమ సభలను అధికారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img