Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ప్రజాస్వామ్యానికి పాతర

. ఐక్యపోరాటాలు అవశ్యం
. ఉద్యమాలపై పోలీసుల ఉక్కుపాదం
. 24, 25న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌లో చర్చిస్తాం
. ఎమ్మెల్సీ ఫలితాలతో జగన్‌ పతనం ప్రారంభం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రజాస్వామ్య సూత్రాల్ని కాలరాస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్న జగన్‌ ప్రభుత్వ విధానాలపై వామపక్ష, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, లౌకికవాదులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసుతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, పోలీసు దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ నిర్బంధాలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నాకు తరలివచ్చిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడే అక్రమంగా పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో నిర్బంధించారని విమర్శించారు. అనారోగ్యానికి గురైన అంగన్‌వాడీల పట్ల కనీస కనికరం చూపకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో అనుమతిచ్చి ఉంటే అంగన్‌వాడీలు శాంతియుతంగా నిరసన తెలిపేవారని, ఏలూరు రోడ్డులో ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చేదికాదని స్పష్టంచేశారు. ఆందోళనలు, ఉద్యమాలకు ముందుగా అనుమతివ్వడం, చివరి నిమిషంలో రద్దు చేయడం పోలీసులకు అలవాటుగా మారిందని నిందించారు. సీపీఐ నాయకత్వాన టిడ్కో ఇళ్లు, జగనన్న ఇళ్ల సమస్యలపై విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాకు ఇటీవల పిలుపునిచ్చామని, దానికి పోలీసులు అనుమతిచ్చినప్పటికీ పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు విజయవాడ రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అనుమతులు ఎందుకిచ్చారు…నాయకులు, కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ జగన్‌ ప్రభుత్వం ఇదే ధోరణితో ఉందని ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. జీవో నంబర్‌ 1 రద్దు కోసం చలో అసెంబ్లీకి పిలుపునిస్తే…అన్ని జిల్లాల్లో వామపక్ష, ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడే అక్రమ అరెస్టులు చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలోనూ జీవో నంబర్‌`1కి వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. చట్టసభల గౌరవాన్ని జగన్‌ ప్రభుత్వం దిగజార్చిందని దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలే స్పీకర్‌పై దాడి చేశారంటూ అసత్యప్రచారం చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కారణంగానే వైసీపీ దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. జగన్‌ దుర్మార్గానికి అంతులేకుండా పోతోందన్నారు. టీచర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గతంలో ఏ ముఖ్యమంత్రి ఆసక్తి చూపలేదని గుర్తుచేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యతతో జగన్‌కు తగిన బుద్ధిచెప్పాయన్నారు. ఇది జగన్‌ ప్రభుత్వ పతనానికి నాంది అని స్పష్టంచేశారు. జగన్‌ సొంత నియోజకవర్గంలో పట్టభద్రులు వ్యతిరేకంగా ఓట్లు వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను జగన్‌ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగానికి ఆయన తిలోదకాలిస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, లౌకికవాదులంతా ఖండిరచాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలలో చర్చిస్తామని, ఐక్య పోరాట కార్యాచరణను రూపొందిస్తామని రామకృష్ణ చెప్పారు.
చట్టసభల్లో ప్రజాసమస్యలు పక్కదారి: ఓబులేసు
చట్టసభలను సజావుగా నడపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అయినా ప్రజాసమస్యల్ని పక్కదారిపట్టిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాయని జి.ఓబులేసు విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా…మోదీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వమూ ప్రజాసమస్యల్ని ఆలకించడం లేదని, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. దీనిపై చర్చించి రైతులకు న్యాయం చేయకుండా…అధికారపక్షమే ప్రజా సమస్యల్ని చర్చకు రాకుండా అడ్డుకుంటూ గందరగోళం చేస్తున్నదని మండిపడ్డారు. మందబలం ఉందనే అహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img