Friday, June 2, 2023
Friday, June 2, 2023

ప్రజా సమస్యల పరిష్కారానికి
సీపీిఐ అభ్యర్థులను గెలిపించండి

. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజా పోరాటంలో సీపీఐ
. దీనికంటే మరో గుర్తింపు ఏముంది: ఎంపీ సుబ్బరాయన్‌

( కేజిఎఫ్‌ నుంచి డాక్టర్‌ ప్రసాద్‌)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పేద ప్రజల సమస్యల కోసం నిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్న సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు కె. సుబ్బరాయన్‌ పిలుపునిచ్చారు. కర్నాటక రాష్ట్రం కేజిఎఫ్‌ నియోజకవర్గంలో సీపీిఐ అభ్యర్థి జ్యోతిబసు విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం రైల్వే స్టేషన్‌ నుంచి మున్సిపల్‌ బస్టాండ్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బరాయన్‌ మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ సీపీిఐ అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్నదన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సీపీిఐ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని గుర్తింపు కలిగి ఉందని, ఇంతకంటే మరో గుర్తింపు అవసరమా అన్నారు. నేడు కర్నాటక ఎన్నికలలో పోటీ చేస్తున్నవారు అందరూ కేవలం అధికార దాహంతో పోటీ చేస్తున్న వారే మాత్రమే అన్నారు. ఎలాగైనా గెలవాలని ధన, అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నంతకాలం అభివృద్ధి చేయలేని వారు ఈసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తాము అంటే నమ్మేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నియంతృత్వ పోకడలు అరికట్టాలంటే ప్రజలు కమ్యూనిస్టులను చట్టసభలకు పంపాలని పిలుపునిచ్చారు. కేజీఎఫ్‌ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జ్యోతిబసును గెలిపించాలని సుబ్బరాయన్‌ కోరారు. సీపీిఐ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ నుంచి కేజీఎఫ్‌ మైన్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సిన రూ.52 కోట్ల బకాయిల కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహించినట్లు చెప్పారు. కార్మికులకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని కేజీఎఫ్‌లో పోరాటాలు నిర్వహించిన పార్టీ సీపీఐ అన్నారు. కేజీఎఫ్‌లో కుల, మత సంఘాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని సూచించారు. వేలాది మంది కార్మికులు ఆంధ్రా, తమిళనాడు నుంచి వలస వచ్చిన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొలేదని అన్నారు. నేటికీ మైన్స్‌ లో పనిచేస్తున్న కార్మికులకు పక్కా ఇల్లు లేదని, వున్న వాటికి పట్టా లేదన్నారు. కేజీఎఫ్‌లో పాలకులు ఒక్క పరిశ్రమను కూడా స్థాపించిన పాపాన పోలేదు అన్నారు. కేజీఎఫ్‌ నియోజకవర్గంలో వేలాదిమంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారనీ, మే 10న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ నుంచి పోటీ చేస్తున్న జ్యోతిబసుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌. నాగరాజన్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పీిఎఫ్‌ ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని సీపీఐ పోరాడుతోందని చెప్పారు. కేజీఎఫ్‌ నియోజకవర్గంలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలతో పాటు చట్టసభల్లో సైతం పోరాటం సాగిస్తామని చెప్పారు. సీపీఐ అభ్యర్థి జ్యోతిబసు మాట్లాడుతూ కేజీఎఫ్‌ మైన్స్‌ లో పనిచేస్తున్న వేలాది కుటుంబాలను పాలకులు నడిరోడ్డుపై వదిలేశారని అన్నారు. నివసించడానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రప్ప, సుబ్రహ్మణ్యం, హరినాథ్‌ ఆలపించిన ఉద్యమ గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీపీిఐ తమిళనాడు రాష్ట్ర సీనియర్‌ నాయకులు లగుమయ, కర్నాటక రాష్ట్ర ఏఐవైవైఫ్‌ రాష్ట్ర కార్యదర్శి హరీష్‌ బాల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img