Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ప్రధాని పర్యటనకు ముందు జమ్మూలో భారీ ఉగ్రదాడి

ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం సీఐఎస్‌ఎఫ్‌ అధికారి మృతి
జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూ జిల్లాలోని జలాలాబాద్‌ సుంజ్వాన్‌ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక భద్రతా అధికారి ప్రాణాలు కోల్పోగా .. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మృతిచెందిన జవాన్‌ను సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ) ఎస్పీ పటేల్‌గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, ఇద్దరు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు ఉన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. జమ్మూ శివారు ప్రాంతంలోని సుంజ్వాన్‌ ఆర్మీ క్యాంప్‌ సమీపంలో తెల్లవారుజామున 4.25 గంటల సమయంలో ముష్కరుల కదలికలను గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. వారి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు నివాస ప్రాంతాల్లోకి పారిపోయారు. వారిని మట్టుబెట్టేందుకు ఆ ప్రాంతంలో అణువణువూ గాలిస్తుండగా ఉగ్రవాదులు గ్రనేడ్లతో కాల్పులకు పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆత్మాహుతి దాడులకు ప్లాన్‌ చేస్తున్న ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ (జేఎం) ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. ‘ఇది జమ్మూలో శాంతికి భంగం కలిగించడానికి మరియు ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి పర్యటనను విధ్వంసం చేయడానికి పెద్ద కుట్రలో భాగం’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి దాడికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఉగ్రమూకల కదలికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉగ్రవాదులు సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా గత గురువారం జమ్మూ నగరంలోకి ప్రవేశించారని, ఆర్మీ క్యాంప్‌కు సమీపంలోని నివాస ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సుంజ్వాన్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు ముందస్తు ఆపరేషన్‌ ప్రారంభించిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందిన తర్వాత తాము గురువారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని పేర్కొన్నారు. అయితే, ఉగ్రవాదులు 15 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని తెలిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లను ఉపయోగించి దాడులకు పాల్పడ్డారని, భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని కాల్పులను తిప్పికొట్టిందని తెలిపారు.
రేపు మోదీ పర్యటన
ఏప్రిల్‌ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలి గ్రామంలో జరిగే భారీ సభలో ప్రసంగించనున్నారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అయితే మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img