Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందజేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విషయంలో పార్లమెంటును, సభాపతిని అవమానపరిచేలా ప్రధాని మాట్లాడారని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు 187వ నిబంధన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్‌ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడిరచారు.మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోడీ, కేంద్రంలోని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించడాన్ని తప్పుబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా ఫిబ్రవరి 2014 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని పేర్కొంటూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్‌ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్‌ ఎంపీలు పెప్పర్‌ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని అన్నారు. ‘‘విభజన బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడం జరిగింది. విభజన ప్రక్రియపై వాటాదారులతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదు, దీని కారణంగా రెండు వైపులా ఇంకా ఆందోళనలు కొనసాగుతోంది’’ అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. తెలంగాణ ఉద్యమాన్నే అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img