Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రపంచం చూపు భారత్‌ వైపు.. బడ్జెట్‌ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్‌ వైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే మొదటి ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమని.. ప్రపంచం కన్ను మొత్తం భారత్‌పైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యమైనదని.. రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఐఎంఎఫ్‌ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచం ఆర్థికంగా పుంజుకుంటుందని.. అలాగే భారతదేశం వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందన్న సానుకూల సందేశాలు మరింత ఉత్సాహానికి నాంది పలికాయంటూ ప్రధాని మోదీ వివరించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే మన ఆర్థిక మంత్రి కూడా మహిళేనంటూ వివరించారు. రేపు నిర్మలా సీతారామన్‌ దేశం ముందు మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులలో భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్‌ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ‘భారత్‌ ముందు, పౌరుడు ముందు’ అనే ఆలోచనతో ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రధాని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. అస్థిర ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య భారతదేశ బడ్జెట్‌ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ వివరించారు. ప్రపంచం మోత్తానికి భారత్‌ ఆశాకిరణంగా ప్రకాశిస్తుందని అభిప్రాయపడ్డారు. నిర్మలా సీతారామన్‌ ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని తాను దృఢంగా విశ్వసిస్తున్నానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img