Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షానిది కీలక పాత్ర

: ప్రధాని మోదీ
ప్రపంచాన్ని అనుసంధానించడంలో.. భారత్‌ను నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలతోనే భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దగలమని వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని అన్నారు.ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌(ఐఎస్‌పీఏ)ను సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ పలువురు శాస్త్రవేత్తలు, ఐఎస్‌పీఏ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన విధానంతో ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగం, అంతరిక్ష సాంకేతికతకు సంబంధించి నేడు దేశంలో జరుగుతున్న సంస్కరణలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ దృష్టితో.. మన దేశం సమగ్ర సంస్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. 130 కోట్ల మంది దేశప్రజల పురోగతికి భారత అంతరిక్ష రంగం గొప్ప మాధ్యమమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంతోనే అన్ని మూడిపడి ఉన్నాయని మోదీ తెలిపారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయడంలో భారత అంతరిక్ష రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సెన్‌ అండ్‌ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్‌), వన్‌వెబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, అనంత్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఉన్నాయి. ఇతర సభ్య సంస్థల్లో గోద్రేజ్‌, అగిస్టా- బీఎస్‌టీ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఈఎల్‌, సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌, మాక్సర్‌ ఇండియా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img