Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి రేపే నోటిఫికేషన్లు

డిసెంబరు 25లోగా నియామక ఉత్తర్వులు జారీ
నవంబరు 30లోగా కోవిడ్‌ కారుణ్య నియామకాలు
బొగ్గు కొరత, విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు
సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు కొత్తగా జరిగే నియామకాలపై ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు జారీచేయడానికి వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సోమవారం కోవిడ్‌-19 నియంత్రణ, నివారణా చర్యలు, వాక్సినేషన్‌పై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా, డిసెంబరు 10న నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. డీఎంఈలో పోస్టులకు సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీచేసి, డిసెంబరు 5న నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌లో పోస్టుల భర్తీకి అక్టోబరు 20 నుంచి 23 వరకూ వరుసగా నోటిఫికేషన్లు జారీచేసి డిసెంబరు 21-25 మధ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. కొత్తగా నిర్మించనున్న 176 పీహెచ్‌సీల నిర్మాణంపైనా అధికారులు దృష్టి పెట్టాలని, జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. కోవిడ్‌ పరిస్థితిపై సీఎం ఆరా తీయగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,034 మాత్రమే ఉన్నాయని, రికవరీ రేటు 99.01 శాతంగా, పాజిటివిటీ రేటు 1.36 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ 1,66,58,195 మంది వేయించుకున్నారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని, నవంబరు 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బొగ్గు కొరత, విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు
రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యుత్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి సోమవారం ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రెండు ర్యాకుల బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు. జెన్‌కో అధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని, ఇందుకోసం సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపైనా ఆలోచనలు చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపైన, సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. పవర్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలియజేయగా, తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img