Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ప్రభుత్వ దమనకాండ

. మహాధర్నా భగ్నానికి కుట్ర
. నంద్యాలలో రామకృష్ణ అరెస్టు
. ఉద్రిక్తత, తోపులాటలు
. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నేతల అరెస్టు, గృహనిర్బంధాలు
. నేడు విజయవాడలో మహాధర్నా
. తరలిరావాలని రామకృష్ణ పిలుపు

విశాలాంధ్రబ్యూరో-కర్నూలు/నంద్యాల :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణ నంద్యాలకు వచ్చారు. సమావేశం అనంతరం ఆయన బయటకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహాధర్నాను భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గృహనిర్బంధానికి పాల్పడ్డారు. ఎక్కడికక్కడ సీపీఐ శ్రేణులను అడ్డుకున్నారు. విజయవాడలో మహాధర్నాను విఫలం చేయాలన్న జగన్‌ సర్కారు ప్రయత్నాలకు పోలీసులు వంతపాడారు. అందులో భాగంగా విజయవాడ మహాధర్నాలో పాల్గొనకుండా చేసేందుకు రామకృష్ణను నంద్యాలలో అడ్డుకున్నారు. రామకృష్ణ అరెస్టుకు యత్నించగా సీపీఐ శ్రేణులు అడ్డుపడ్డాయి. సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, నాయకులు రమేశ్‌, బాబా ఫకృద్దీన్‌ తదితరులు అడ్డుగోడగా నిలువగా సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు విరుచుకుపడ్డారు. నాయకులను బలవంతంగా ఈడ్చివేసి రామకృష్ణను పోలీస్‌ కారులో ఎక్కించారు. కారుకు అడ్డుపడిన సురేశ్‌ ధనుంజయుడులను లాగేశారు. అందరిని స్థానిక 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దిన్‌, సీపీఐ కార్యవర్గ సభ్యులు సుంకన్న, ప్రసాద్‌ తదితరులున్నారు. సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాధం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌, పత్తికొండలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాసాహెబ్‌, తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్‌, పెద్దకడుబూరు సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్‌లను పోలీసులు కర్నూలులో గృహనిర్భందం చేశారు. అనంతరపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీశ్‌, ఇతర సీపీఐ నాయకులను నిర్బంధించారు.
అరెస్టులకు భయపడం: రామకృష్ణ
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాకు తరలివస్తున్న సీపీఐ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, గృహనిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. పత్తికొండ, కర్నూలు తదితర కేంద్రాల్లో అరెస్టులు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడ ధర్నాలకు దిగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు రామకృష్ణ పిలుపునిచ్చారు. అరెస్టులకు భయపడవద్దని, ప్రభుత్వంలో కదలిక వచ్చే వరకు నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తామన్నారు. పేదల కోసం ఉద్యమాలు చేస్తున్నామని, ప్రభుత్వానికి మనసుంటే చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img