Monday, June 5, 2023
Monday, June 5, 2023

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుకు నష్టం

. ప్రభుత్వం ఆదుకోవాలి: రామకృష్ణ
. దెబ్బతిన్న పంటలు పరిశీలించిన సీపీఐ ప్రతినిధి బృందం

విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు పూర్తిగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శిం చారు. పసుపు, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట సేకరణ ప్రారంభించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని చెప్పారు. రైతుసంఘాల నాయకులతో కలిసి సీపీఐ బృందం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులి పాకలో మంగళవారం పర్యటించింది. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించింది. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి…నష్టంపై సీపీఐ బృందం ఆరాతీసింది. రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి కళ్లాల్లో తడిసిన పసుపు, ఈదురుగాలులకు వంగిపోయి పూర్తిగా తడిసిన మొక్కజొన్న, తెల్లజొన్న పంటలను పరిశీలించింది. అక్కడ పని చేస్తున్న కూలీలతో మాట్లా డిరది. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ పసుపు ఎకరానికి లక్ష రూపాయలు, మొక్కజొన్న ఎకరానికి రూ.40 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ఇతర పనులు పక్కనపెట్టి తక్షణమే పంట నష్టం అంచనా వేయాలని కోరారు. రైతులను ఆదుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని రామకృష్ణ సూచించారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు ఉంటే పరిహారం వారికే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖమంత్రిని కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరనున్నట్లు చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యత్నాలను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మికసంఘాలు బుధవారం రాష్ట్రవ్యాప్తగా చేపట్టనున్న రాస్తా రోకోలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రామకృష్ణ ప్రకటించారు. పోరా టంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలియజేస్తామని చెప్పారు. కార్మికసంఘాల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతివ్వాలని కోరారు. రాస్తారోకోలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ వరికోతలు, మినుము నూర్పిళ్ల సమయంలో అకాల వర్షాలు రైతు లను కోలుకోలేని దెబ్బతీశాయని చెప్పారు. టమాట, ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ పేరుతో రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. పసుపు క్వింటాకు మద్దతు రూ.6,850 ఉంటే బయట రూ.4,200లకే అడుగుతున్నారని చెప్పారు. మొక్కజొన్న క్వింటా మద్దతు రూ.1962 ఉంటే బయట రూ.1500 పలుకు తుందన్నారు. ధాన్యం 75 కిలోల బస్తా మద్దతు ధర రూ.2,060 కాగా మార్కెట్‌లో రూ.900 కూడా పలకడం లేదన్నారు. మద్దతు ధరకు ప్రభుత్వం పంట కొనుగోలు చేయించకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రసాద్‌ ప్రశ్నించారు. ఈ బృందంలో కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్‌, కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్‌ కార్యదర్శి టి.తాతయ్య ఉన్నారు.
రైతుల ఆవేదన
పంట నష్టాన్ని పరిశీలించటానికి వచ్చిన సీపీఐ బృందం వద్ద రైతులు బండి సదాశివరావు, మేడసాని రాంబాబు, ఎస్‌కే నజీర్‌, అట్లూరి శ్రీనివాసరావు, ఘంటా వెంకటేశ్వరరావు, చుండూరి లాజరు, కరిముల్లా, వల్లూరు ఏలియా తమ గోడు చెప్పుకున్నారు. ఆరుగాలం కష్టించి పండిరచిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు తమ జీవితాల్ని తలక్రిందులు చేశాయని కన్నీరుమున్నీరయ్యారు. పంట కాపాడుకోవటానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. పెట్టిపెట్టుబడి సంగతి పక్కన పెడితే… కుటుంబాలను ఎలా పోషించాలని వండిన పసుపు, తడిసిన మొక్కజొన్న పంటలు చూపించి బోరున విలపించారు. రైతులను ఓదార్చిన సీపీఐ బృందం…అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img