Friday, March 31, 2023
Friday, March 31, 2023

ప్రయోగాలొద్దు…కాంగ్రెస్‌కే మళ్లీ పట్టం


పంజాబ్‌ ఓటర్లకు రాహుల్‌గాంధీ పిలుపు
చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాలకు అవకాశం ఇవ్వకుండా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీనే గెలిపించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటర్లకు మంగళవారం పిలుపునిచ్చారు. ఇక్కడికి 30 కి.మీ దూరంలోని రాజ్‌పురాలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. సరిహద్దు రాష్ట్రంలో శాంతిని కాపాడగల సామర్థ్యం తమ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పంజాబ్‌పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఒక వ్యక్తి కాదని ఆయన వెనుక ఆయన వెనుక దేశాన్ని దోచుకునే శక్తులున్నాయని మండి పడ్డారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్‌టీ, నోట్ల రద్దు నిర్ణయాల వల్ల ఒకరిద్దరు సంపన్నులకు మాత్రమే లబ్ధి కలిగిందన్నారు. మోదీ తన ఎన్నికల ర్యాలీల్లో ఎక్కడా నిరుద్యోగం, నల్లధనం సమస్యల గురించి మాట్లాడటమే లేదన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌ సమస్యను అంతం చేస్తుందన్నారు. కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీకి పంజాబ్‌పై ఏమాత్రం అవగాహన లేదన్నారు. ‘మోహల్లా క్లినిక్స్‌ స్థాపించి వైద్య సదుపాయాలు మెరుగు చేశాం అని ఆప్‌ అంటోంది. కానీ దిల్లీలో కోవిడ్‌ రెండో దశ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఆప్‌ దిల్లీ దశను మార్చినట్లయితే కరోనా రెండో దశలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆక్సిజన్‌ సిలిండర్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దిల్లీలో ఆప్‌ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ‘ఏక్‌ బార్‌ మోకా దో’ (ఒక్కసారి అవకాశం ఇవ్వండి)అంటూ మీకు వాగ్ధానాలు చేస్తున్న వారు పంజాబ్‌ను నాశనం చేస్తారు. పంజాబ్‌ కాలిపోతుంది, నా మాటలు గుర్తుంచుకోండి’ అని ఆప్‌పై విరుచుకుపడ్డారు. చన్నీ సారథ్యంలో ఏర్పడే కాంగ్రెస్‌ సర్కారు సంపన్నుల కోసం కాకుండా పేదలు, రైతుల కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేబుల్‌, రవాణా రంగాల్లో గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. ‘రైతుల వద్ద ఉన్నవాటిని లాక్కోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? దేశంలోని అతిపెద్ద మూడు-నాలుగు బిలియనీర్లు లాక్కోవాలనుకున్నారు. వారికి మోదీ వత్తాసు పలుకుతున్నారు’ అని రాహుల్‌ విమర్శించారు. భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, దీని వల్ల ఏ శక్తికి ప్రయోజనం కలుగుతోందని సభికులను ప్రశ్నించారు. ఇవే శక్తులు వ్యవసాయ చట్టాలను అమలు చేశాయన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను మోదీ తగ్గించలేకపోయారని, పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఆ పని చేశారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img