Monday, June 5, 2023
Monday, June 5, 2023

బంకర్లలో కూర్చుని ‘జగనన్నకు చెప్పండి’ అంటే ఎలా చెప్పగలరు?

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
బటన్‌ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్య

‘దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడిరచండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఏపీలో మాత్రం ‘మోదీ, జగన్‌ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జగన్‌, మోదీ ఇద్దరూ రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని అన్నారు. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారన్నారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్‌ మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘బటన్‌ నొక్కితే సమస్యలు పరిష్కారం కావు. బంకర్లలో కూర్చుని ‘జగనన్నకు చెప్పండి’ అంటే ఎలా చెప్పగలరు?’’ అని ప్రశ్నించారు. ఏపీలో అడుగడుగునా మోదీకి సీఎం జగన్‌ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్‌ ఇద్దరూ కవల పిల్లలన్నారు. బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామంటే ఇవ్వబోమంటున్నారని.. కేవలం ప్రైవేట్‌ వాళ్లకే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చింది. ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారు. మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారు.. వాళ్లే దేశాన్ని దోచుకుంటున్నారు’’ అని అన్నారు. కర్ణాటకలో గెలుపు కోసం మోదీ మతాల మధ్య చిచ్చుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటుకు గురయ్యేలా చేశారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img