Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బిపిన్‌ రావత్‌ దుర్మరణం

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌
ఆయన భార్య, మరో 11 మంది మృతి
గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ పరిస్థితి విషమం
వెల్లింగ్టన్‌ సైనిక కళాశాలలో లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్లిన సీడీఎస్‌
ప్రధానికి వివరించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌
కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ
ప్రమాదంపై నేడు పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటన

న్యూదిల్లీ : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం చెందారు. ఆయనతో పాటు భార్య మధుమిక, మరో 11 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో బుధవారం సంభవించింది. ప్రమాదానికి గురైంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల సైనిక హెలికాప్టర్‌. హెలికాప్టర్‌లో రావత్‌ దంపతులు సహా 14 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను కూనూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు జనరల్‌ రావత్‌, ఇతర సైనిక ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఎంఐ17 హెలికాప్టర్‌ కూనూర్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది’ అని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) ధ్రువీకరించింది. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళం తెలిపింది. డీఎన్‌ఏ పరీక్ష వివరాలను సమీక్షించిన తర్వాత బిపిన్‌ రావత్‌ మరణంపై ప్రకటన జారీ చేసింది. ల్యాండిరగ్‌కు 10 నిమిషాల ముందు.. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కళాశాలలో లెక్చర్‌ ఇచ్చేందుకు బుధవారం ఉదయం రావత్‌ దంపతులు సైనిక అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. ఉదయం 11.35 గంటలకు సూలూరు వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న రావత్‌..అక్కడి నుంచి మొత్తం 14మందితో ఎంఐ17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. హెలికాప్టర్‌ మరో 10 నిమిషాలలో ల్యాండ్‌ అవుతుందనగా ప్రమాదం చోటుచేసుకుంది. కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా చెట్టుపై కూలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో హెలికాప్టర్‌ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూ కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌నకు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సమాచారం తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు బకెట్లు, నీటి గొట్టాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు పరుగులు తీశారు. అప్పటికే కొన్ని కాలిపోయిన శరీరాలు చుట్టూ పడి ఉన్నాయి. కొండపై చెల్లాచెదురుగా ఉన్న హెలికాప్టర్‌ శకలాలు, మృతదేహాలను గుర్తించడానికి భద్రతా సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు, పడిపోయిన చెట్ల కింద నుండి కాలిపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సహాయక సిబ్బంది మృతదేహాలను స్ట్రెచర్లపై తీసుకువెళ్లి అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. హెలికాప్టర్‌ నివాస ప్రాంతాలకు కొంత దూరంలో పడిపోవడంతో పెద్ద విషాదం తప్పింది. భారీ ప్రాణనష్టం నివారించబడిరది. కోయంబత్తూర్‌లోని అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కొండ ప్రాంతాలైన నీలగిరి జిల్లాలోని కట్టేరి-నంచప్పచత్రం ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్‌ శిథిలాల నుండి నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నాయి. స్థానిక ప్రత్యక్ష సాక్షులు ఒక తమిళ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, పెద్ద శబ్దం వినిపించిందని, హెలికాప్టర్‌ కూలిపోతూ కనిపించిందని, తరువాత అది కాలిపోయిందని వివరించారు. కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా కాలిన గాయాలతో ఉండటం చూశామని చెప్పారు. కాగా భారత వైమానిక దళ ప్రధానాధికారి చౌదురి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అయిన కేబినెట్‌కు, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి ఘటన గురించి వివరించారు. రక్షణ రంగ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇంటికి రాజ్‌నాథ్‌, సైనిక దళాల ప్రధానాధికారి నరవానే వెళ్లి వచ్చారు.
హెలికాప్టర్‌లో ఉన్నది వీరే..
ఎంఐ`17 హెలికాప్టర్‌ సామర్థ్యం 24 మంది కాగా బుధవారం ఇందులో రావత్‌తోపాటు 13 మంది ప్రయాణించారు. వివరాల ప్రకారం, రావత్‌, ఆయన భార్య మధులిక, బ్రిగేడ్‌ ఎల్‌.ఎస్‌ లిద్దర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గుర్‌సేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర, లెఫ్టినెంట్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌, లెఫ్టినెంట్‌ నాయక్‌ సాయి తేజ, హవాల్దార్‌ సత్పాల్‌ ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన సాయితేజ చిత్తూరు జిల్లా కురబల మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన వారు. సాయితేజ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా పని చేస్తున్నారు.
కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వయిరీకి ఆదేశించిన వైమానిక దళం
కోయంబత్తూర్‌లోని సమీపంలోని సూలూర్‌ వైమానిక దళ కేంద్రం నుండి బయలుదేరిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదంపై కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి ఆదేశించినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. పొగమంచుతో తక్కువ దృశ్యమానత కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
కేబినెట్‌ భద్రతా వ్యవహారాల కమిటీ సంతాపం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేబినెట్‌ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌తోపాటు ఇతర అధికారులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు అజిత్‌ దోవల్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశ మొదటి సీడీఎస్‌గా రావత్‌..
జనరల్‌ బిపిన్‌ రావత్‌(63) జనవరి 2019లో భారత మొదటి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)గా బాధ్యతలు చేపట్టారు. సైనిక, వైమానిక, నావికా దళాలు అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి ఈ పదవిని సృష్టించారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, సైన్యాన్ని మరింత పటిష్టం చేయడం సీడీఎస్‌ బాధ్యత. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీకి శాశ్వత చైర్మన్‌. రాజకీయ నాయకత్వానికి నిష్పాక్షిక సలహా ఇవ్వడంతో పాటు రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా ఉండాలి. ఒక మాజీ ఆర్మీ చీఫ్‌ అయిన జనరల్‌ రావత్‌ కొత్తగా సృష్టించిన సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా కూడా నియమితులయ్యారు. జనరల్‌ 1978లో సైన్యంలో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా చేరిన రావత్‌ జమ్ము,కశ్మీర్‌లో, చైనా సరిహద్దులో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బలగాలకు నాయకత్వం వహించి నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారు. సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ రావత్‌ మృతికి అనేక మంది మాజీ సైనిక దళాల ప్రధానాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత సురక్షితమైనదిగా పేరుండటంతో ఎంఐ-17 డబుల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌ వీవీఐపీల కోసం ఉపయోగిస్తారని వారు తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
సైనిక హెలికాప్టర్‌ ఘటన తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. ఓ ధైర్యవంతుడైన సైనికుడిని దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలపాటు మాతృభూమికి నిస్వార్ధంగా సేవలందించిన రావత్‌ తన శౌర్యంతో, వీరత్వంతో గుర్తింపు పొందారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సైనిక సిబ్బంది అంకిత భావంతో దేశానికి సేవలందించారు. మరణించిన సైనిక సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. రావత్‌ మృతికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు. రావత్‌ మాతృభూమికి సేవ చేసిన ధైర్యవంతుడైన సైనికుడని, వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మాటల్లో చెప్పలేమని అన్నారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రావత్‌ మృతి పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని ట్విటర్‌లో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్‌ మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌, సైనికాధికారుల మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజతోపాటు ఈ దుర్ఘటన మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img