Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం

పార్టీ నూతన జెండావిష్కరణ
తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు
హాజరైన జేడీఎస్‌ అధినేత కుమారస్వామి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో ఈసీ పంపిన లేఖకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. దీంతో భారత్‌ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్‌ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు. త్వరలో దిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 14న దిల్లీ సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోని భారత్‌ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యవర్గం ఏర్పాటుతో పాటు జాతీయ కార్యదర్శుల నియామకంపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. దిల్లీలో అనేకమంది రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో కూడా కేసీఆర్‌ భేటీ కానున్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో ముఖ్యమంత్రి కసీఆర్‌ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ సంతోశ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img