Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

బీజేపీకి సహకరించే ఎవరితోనైనా యుద్ధమే

. సమస్య ఉన్నచోట కమ్యూనిస్టులు తెల్లకొంగల్లా వాలాలి
. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే మోదీ ప్రభుత్వంపై నిరంతర పోరు
. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో నారాయణ

విశాలాంధ్ర బ్యూరో` విశాఖపట్నం: బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే ఏ శక్తులతోనైనా రాబోయే రోజుల్లో యుద్ధమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 27వ మహాసభల్లో ఆదివారం ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇందుకోసం ప్రజా ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని, దీనిపై బీజేపీయేతర శక్తులతో కలిసి ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ విషయమై స్థానికంగా ప్రాంతీయ పార్టీలతో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ అంతిమంగా బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యం కావాలన్నారు. పార్టీ బలోపేతానికి నేతలు కార్యాచరణ రూపొందించుకోవాలని, నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి నారాయణ వివరించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెల్లకొంగల్లా కమ్యూనిస్టులు వాలిపోవాలని, అప్పుడే పార్టీ విస్తరణ, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమస్య ఉన్న ప్రాంతంలో పార్టీ లేదని వెళ్లకుండా, పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. ఎవరో చేసే ఉద్యమాలకు మద్దతు తెలియజేయడం వల్ల పార్టీ బలోపేతం కాదని, సమస్య పరిష్కారానికి కృషి చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయన్నారు. కమ్యూనిస్టు అనేవాడు సమస్యను గుర్తించగలగాలని, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నీరున్న చోట తెల్లకొంగ వాలినట్లుగా అక్కడకు వెళ్లిపోవాలన్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడే విషయంలో జైలుకి వెళ్లడానికి కూడా వెనుకాడకూడదన్నారు. అలాంటి త్యాగాలకు సిద్ధమైనప్పుడు, మనం చేసే పోరాటంలో నిజాయతీ ఉన్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా మనవైపే ఉంటారని నారాయణ అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం, కొత్త సమస్యలను గుర్తించడం, ఆధునిక పోకడలకనుగుణంగా పోరాట పంథా మార్చుకోవడం ద్వారా కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. ముఖ్యంగా పార్టీలో చురుకుగా పనిచేసేవారిని, నాయకత్వ లక్షణాలను గుర్తించి అటువంటివారిని ప్రోత్సహించడం పార్టీ నిర్మాణంలో కీలకాంశంగా పేర్కొన్నారు. నేతలు హక్కుల గురించి కాకుండా బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని ఉద్బోధించారు. పార్టీ నిర్మాణం, ప్రజాసంఘాల బలోపేతం, సమీకరణ శక్తి పెంపుపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ శాఖలు ఆర్థిక పరిపుష్ఠి కలిగి ఉండాలని, ఇందుకోసం ప్రజలను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యుత్‌ చార్జీల పెంపు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు ప్రక్రియపై గతంలో జరిగిన విద్యుత్‌ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో చారిత్రక పోరుకు సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభకు ముప్పాళ్ల నాగేశ్వరరావు, పి.హరినాథరెడ్డి, విమల, కోనాల భీమారావు, అప్సర్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించగా, వేదికపై సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా, కార్యవర్గసభ్యులు అనీరాజా, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img