Friday, December 2, 2022
Friday, December 2, 2022

బీజేపీ, వైసీపీ కుమ్మక్కు

. మోడీ అండతో జగన్‌ మూర్ఖపు పాలన
. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యపోరు అవశ్యం
. చంద్రబాబు జాతీయస్థాయిలోనూ ముఖ్యపాత్ర పోషించాలి
బ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ మద్దతుతోనే రాష్ట్రంలో సీఎం జగన్‌ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని జగన్‌…ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇతర వామపక్షాలు, ప్రజాసంఘాలు, టీడీపీ, జనసేన సహా అన్ని లౌకిక శక్తులతో కలిసి పోరాటాన్ని తీవ్రం చేద్దామని పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణతోపాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు. జగన్‌ మూర్ఖపు పాలనకు మోదీ అండదండలున్నాయని రామకృష్ణ విమర్శించారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వం నెల రోజులు కూడా పాలన కొనసాగించలేదన్నారు. ముఖ్యమంత్రిపై అనేక కేసులున్నా మోదీ పట్టించుకోవడం లేదని, జగన్‌ కనీసం కోర్టు వాయిదాకు కూడా హాజరు కావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మితిమీరిన అప్పులు చేయడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, చివరకు సీఎం సొంత బాబాయి వైఎస్‌ వివేకా కేసును సైతం నీరుగార్చేందుకు కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగించి మూడేళ్లు దాటినా పురోగతి కానరావడం లేదన్నారు. అమరావతి రాజధాని విషయంలోనూ వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను కేంద్రం సమర్థిస్తోందని, స్వయంగా మోదీ శంకుస్థాపన చేసినా రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆరోపించారు. అమరావతి రైతులు మూడేళ్లుగా అందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక శాఖలకు సంబంధించిన స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ పదవిని మోదీ సర్కారు కట్టబెట్టిందని గుర్తు చేశారు. వైసీపీ కూడా మోదీ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో పూర్తి వత్తాసు పలుకుతోందని, బీజేపీ ప్రవేశపెట్టే కీలక బిల్లులన్నింటికీ వైసీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. మోదీ, అమిత్‌షాతో కుమ్మక్కై పరస్పర అవగాహనతో, వారి పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని, అటువంటి వ్యక్తి మనకు సీఎం కావడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకి తెలియదా ? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ వ్యవహారం ఇప్పుడే అర్థమైందన్నారు. అందుకే బీజేపీపై ఆయన అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. విభజన అంశాలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ, మరోపక్క జగన్‌ నియంతృత్వ పాలనకు సంపూర్ణ మద్దతిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చంద్రబాబు వంటి సీనియర్‌ నేత దేశ రాజకీయాల్లోనూ ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. ఈ రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
భారత్‌ జోడో యాత్రకు సంపూర్ణ మద్దతు
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడోయాత్రకు సీపీఐ రాష్ట్ర సమితి తరపున రామకృష్ణ సంపూర్ణ మద్దతు తెలిపారు. విభజన అంశాలకు సంబంధించి అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ఇతర విభజన అంశాల అమలుకు కట్టుబడి ఉన్నామని రాహుల్‌ గాంధీ ప్రకటించడం పట్ల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
సీపీఐ సభల విజయవంతానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
ఈనెల 14నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం అయ్యాయని, ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మంచి కవరేజ్‌ ఇచ్చిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహాసభల్లో సీపీఐ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన డి.రాజా తొలిసారిగా రాజమండ్రి వెళ్లి అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొని, మద్దతు తెలియజేశారన్నారు.
సీపీఐ ప్రదర్శన, బహిరంగసభకు అనూహ్య స్పందన
సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించిన మహా ప్రదర్శన, బహిరంగ సభలకు, ఆగస్టులో విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభ సందర్భంగా జరిగిన ప్రజా ప్రదర్శనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా సీపీఐ రాష్ట్రంలో ప్రజల పక్షాన సైద్ధాంతిక నిబద్ధతతో చేసిన పోరాటాలు, కృషే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత బలోపేతమైన ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img