Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

బీబీసీపై మోదీ ‘ఐటీ’ అస్త్రం

దిల్లీ, ముంబై కార్యాలయాల్లో ‘సర్వే’లు

. పన్నుల అవకతవకల నెపంతో తనిఖీలు
. తీవ్రంగా ఖండిరచిన విపక్షాలు, ఎడిటర్స్‌ గిల్డ్‌
. పూర్తిగా సహకరిస్తున్నాం: మీడియా సంస్థ
. ప్రపంచంలోనే అత్యంత అవినీతి సంస్థ: బీజేపీ

న్యూదిల్లీ: తమను విమర్శించే ప్రతి ఒక్కరిపై ఐటీ/ఈడీ లేక సీబీఐ రూపేణ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఇటీవల ‘ది మోదీ క్వశ్చన్‌’ అంటూ గుజరాత్‌ అలర్లలో మోదీ పాత్ర నేపథ్యంలో విడుదలైన బీబీసీ డాక్యుమెంటరీ కేంద్రప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. దీంతో ఆ డాక్యుమెంటరీ ఎక్కడా విడుదల కాకుండా, యూనివర్సిటీల్లోనూ ప్రసారానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. డాక్యుమెంటరీ వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగానే బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థపై తమదైన శైలిలో కక్షసాధింపు చర్యలకు మోదీ సర్కార్‌ పూనుకుంది. భారత్‌లోని దిల్లీ, ముంబైలోగల బీబీసీ కార్యాలయాలపైకి ‘ఐటీ’ అస్త్రాలు సంధించింది. ‘సర్వే’ పేరుతో సోదాలు జరిపించింది. అంతర్జాతీయ పన్నుల అవకతవకలు, బీబీసీ సబ్సిడరీ కంపెనీల్లో ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌పై సర్వే నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. బీబీసీకి ముందే నోటీసులు ఇవ్వగా ఆ సంస్థ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. లండన్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు భారత్‌లోని శాఖల్లో వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఐటీ సర్వేకు సహకరిస్తున్నాం: బీబీసీ
భారత్‌ రాజధాని దిల్లీతో పాటు ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ ‘సర్వే’లకు పూర్తిగా సహకరిస్తున్నట్లు బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) వెల్లడిరచింది. తమ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు ట్విట్టర్‌ మాధ్యమంగా తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఐటీ అధికారులు దిల్లీ, ముంబై కార్యాలయాలకు చేరుకున్నట్లు పేర్కొంది. ఆ కార్యాలయాల సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని, వారి ఫోన్లు ఆపేశారని, ల్యాప్‌ట్యాప్లు, కంప్యూటర్లు వాడనివ్వలేదని తెలిపింది. ‘ఐటీ సర్వేకు సహకరిస్తున్నాం. ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాం’ అని బీబీసీ ట్వీట్‌ చేసింది.
మరోవైపు ప్రతిపక్షాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించాయి. అదానీ గ్రూప్‌పై హిండర్‌బర్గ్‌ నివేదిక గురించి దర్యాప్తు కోసం తామంతా డిమాండ్‌ చేస్తుంటే కేంద్రప్రభుత్వం బీబీసీ మీద పడిరదని విమర్శించారు. పతనం దగ్గరపడినప్పుడు సంబంధిత వ్యక్తి సొంత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ‘ప్రభుత్వం భయంతో సత్యం గొంతు నులిపేందుకు ఐటీ చర్యలకు పూనుకుంద’ని సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం విమర్శించారు. ‘బీబీసీపై దాడి చేసి సర్వే అంటారు! ఈ సర్వే… ప్రభుత్వం భయంతో చేపట్టిన కక్షసాధింపు చర్యలకు సంకేతం. సత్య గళాన్ని నొక్కేసే ప్రయత్నం. ప్రపంచం అంతా చూస్తోంది. మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు ఇదే విషయంలో ఆయనను నిలదీస్తుంది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నిస్తుంది. అన్నింటికీ సమాధానాలు ఇవ్వగలరా?’ అని విశ్వం ట్వీట్‌ చేశారు. ఇలా చేస్తే ప్రజాసామ్యానికి తల్లిలా భారత్‌ ఉండగలదా? అని సీపీఎం ప్రశ్నించింది. ‘వినాశ కాలంలో విపరీత బుద్ధి’ అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. వాలెంటైన్స్‌ డే ‘సర్వే’లు చేస్తున్న ఐటీ, సెబీ, ఈడీ… ప్రభుత్వానికి ఎంతో ప్రీతిపాత్రుడైన ‘మిస్టర్‌ ఏ’ను సోదా చేయగలవా? అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మెయిత్రా ప్రశ్నించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా స్పందిస్తూ ‘బీబీసీ ఇండియా కార్యాలయాలపై ఐటీ సర్వేలు ఆందోళనకరం. ఇది మీడియా సంస్థలను బెదిరించడం, వేధించడం అన్న ప్రభుత్వ పంథా కొనసాగింపే…’ అని వ్యాఖ్యానించింది. మీడియా సంస్థలు, పాత్రికేయుల హక్కులను హరించకుండా ఇటువంటి దర్యాప్తులప్పుడు అత్యంత సున్నితంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేసింది. అయితే అన్ని విమర్శలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌతం భాటియా తిప్పికొట్టారు. ఐటీ అధికారులను వారి పనిని చేసుకోనివ్వండి. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన సంస్థ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img