Monday, March 20, 2023
Monday, March 20, 2023

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై విచారణకు సుప్రీం అంగీకారం.. కేంద్ర న్యాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిందని, దీనిని చూస్తున్న వారిని అరెస్టులు చేయిస్తోందని పేర్కొంటూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే, తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్‌ల మరో పిటిషన్‌ వేశారు. ఈ డాక్యుమెంటరీని సుప్రీంకోర్టు స్వయంగా వీక్షించి గుజరాత్‌ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు. కేంద్రం తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా తాము చేసిన ట్వీట్‌లను తొలగించిందని ఎన్‌. రామ్‌ ఆరోపించారు. తమ పోస్టులను పునరుద్ధరించేలా గూగుల్‌, ట్విటర్‌లను ఆదేశించాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం వచ్చే సోమవారం వీటిని విచారిస్తామని తెలిపింది.కాగా, ఈ పిటిషన్‌లు దాఖలు చేసిన వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. వేలాది మంది సామాన్యులు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగ ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా పనికిమాలిన పిటిషన్లు, బెయిల్‌ పిటిషన్లను కోర్టు విచారణ చేపడుతోందని ఇటీవల కిరణ్‌ రిజిజు విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img