కరోనా కొత్త కొత్త వేరియంట్‌లను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు ధనిక దేశాలు బూస్టర్ డోసులు అందిస్తున్న విషయం తెలిసిందే. భారత్ కూడా ప్రికాషన్ పేరిట ముంపు పొంచి ఉన్న వర్గాలకు మూడో టీకాను ఇస్తోంది. అయితే ఈ బూస్టర్ డోసు విషయంలో ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించకూడదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బూస్టర్ డోసుల విషయమై జాతీయ టీకా కార్యక్రమ సలహా మండలి (ఎన్‌టీఏజీఐ) బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశమైంది. దీనికి సంబంధించి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ‘బూస్టర్ డోసు ఇచ్చిన ఏ దేశంలోనూ కేసుల ఉధృతికి అడ్డుకట్టపడటం లేదు. అలాగే ఈ విషయంలో ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించం. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని నిర్ణయాలు తీసుకుంటాం. టీకాతో కరోనా వైరస్ తీవ్రతను తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం చాలా ముఖ్యం. అటువంటి తరహా టీకా అవసరం. దాని ద్వారా సమూహ వ్యాప్తిని నిరోధించవచ్చు.్పు అని చెప్పారు. కాగా ప్రపంచవ్యాప్తంగా అల్పాదాయ దేశాలు టీకా కొరత ఎదుర్కోవడంతో మొదట బూస్టర్ డోసుల పంపిణీని నిషేధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దేశాలకు విజ్ఞప్తి చేసింది. 2021 చివర వరకు అయినా ఆగాలని కోరింది.